భారత దిగ్గజ ఫుట్‌బాలర్, ఈస్ట్ బెంగాల్ దిగ్గజం సురాజిత్ సేన్‌గుప్తా గురువారం కన్నుమూశారు. కొవిడ్-19తో సుదీర్ఘంగా పోరాడిన ఆయన నగరంలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71 ఏళ్లు. 1970ల్లో కోల్‌కతా మైదాన్‌లో సురాజిత్ సేన్ ఫుట్‌బాల్‌ను డ్రిబ్లింగ్ చేస్తుంటే అభిమానులు మైమైరచిపోయేవారు.
కరోనా పాజిటివ్ రావడంతో సురాజిత్‌ను జనవరి 23న ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం వరకు ఆయన్ను వెంటిలేటర్ పైనే ఉంచారు. ఆరోగ్యం కాస్త కుదుటపడినట్టే అనిపించినా గురువారం ఒక్కసారిగా క్షీణించింది.
'సురాజిత్ పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ శుక్రవారం నుంచి ఆయనకు శ్వాస సంబంధ ఇబ్బందులు వచ్చాయి. ప్రాణవాయువు స్థాయిలు తగ్గిపోయాయి. సోమవారం నుంచి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచాం' అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
'వెటరన్ స్టార్ ఫుట్‌బాలర్ సురాజిత్ సేన్‌గుప్తా ఈ రోజు మరణించారు. ఆయన ఫుట్‌బాల్ అభిమానులకు ఆరాధ్యుడు. జాతీయ క్రీడాకారుడు. అంతకుమించి మంచి వ్యక్తి. ఆయనెప్పుడూ మన హృదయాల్లోనే ఉంటారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని పశ్చిమ్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
సురాజిత్ 1974, జులై 24న అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశారు. కౌలాలంపూర్‌లో జరిగిన మెర్డెకా కప్‌లో థాయ్‌ల్యాండ్‌పై మొదటి మ్యాచ్ ఆడారు. మొత్తంగా 14 మ్యాచుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1974, 1978 ఆసియా క్రీడల్లో ఆయన భాగమయ్యారు. 1974లో మెర్డెకా, 1977లో ప్రెసిడెంట్స్ కప్, అదే ఏడాది బహ్రెయిన్, యూఏఈతో స్నేహపూర్వక మ్యాచులు ఆడారు. 1978లో ఏకైక ఇంటర్నేషనల్ గోల్‌ను కువైట్‌పై చేశారు.
'సురాజిత్ దా లేరని తెలియడం బాధాకరం. భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఆయనో అద్భుతమైన వింగర్. దేశ ఫుట్‌బాల్‌కు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుంటాయి. ఆయన లేకపోవడంతో భారత ఫుట్‌బాల్ రంగం పెద్దదిక్కు కోల్పోయింది' అని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ అన్నారు.