టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ఎంపిక సరైనదేనని అంటున్నారు. మూడు ఫార్మాట్లలో రాణిస్తున్న ఫాస్ట్‌ బౌలర్‌ను నాయకత్వ బృందంలోకి తీసుకోవడం మంచిదేనని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నారు. రిషభ్‌ పంత్‌ను కాదని అతడిని ఎంపిక చేయడం సులభ నిర్ణయమని వెల్లడించారు.


'వైస్‌ కెప్టెన్సీకి పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా సరైనవాడు. అతడు ప్రతిదానికీ కారణాలను అన్వేషించే ఆటగాడు. అలాంటప్పుడు అతడికెందుకు రివార్డు ఇవ్వకూడదు? ఈ నిర్ణయం నాకెంతో నచ్చింది. అన్ని ఫార్మాట్లలో బాగా రాణిస్తున్న ఫాస్ట్‌ బౌలర్‌ను ఎందుకు కెప్టెన్‌ చేయొద్దు?' అని ఎమ్మెస్కే ప్రశ్నించారు. అతడిని నాయకత్వ బృందంలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు.






'నాయకత్వ బృందంలోకి తీసుకోనంత వరకు బుమ్రా నుంచి ఏం కోరుకుంటున్నామో అతడికెలా తెలుస్తుంది! వైస్‌ కెప్టెన్సీ ఒక వన్డే సిరీసుకే కాబట్టి ఇది సులభ నిర్ణయమే. ఒకవేళ రోహిత్‌, రాహుల్‌ ఇద్దరూ లేకుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది' అని ప్రసాద్‌ అన్నారు.


మాజీ ఆల్‌రౌండర్‌ రితీందర్‌ సింగ్‌ సోధి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్ప్రీత్‌ బుమ్రా కెప్టెన్సీకి అర్హుడని గతంలోనే చెప్పానన్నారు. 'ఫాస్ట్‌ బౌలర్లు కెప్టెన్‌గా చేయలేరన్నది పెద్ద అపోహ. ఫాస్ట్‌ బౌలర్లు ఆటను బాగా అర్థం చేసుకుంటారు. మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు కాబట్టే బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రాబోయే వన్డే సిరీసులో రాహుల్‌, బుమ్రా జట్టును ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరం' అని ఆయన పేర్కొన్నారు.






టీమ్‌ఇండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసు ఆడుతోంది. సెంచూరియన్ వేదికగా బాక్సింగ్‌ డే నాడు మొదలైన టెస్టులో కోహ్లీసేన అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్ధమైంది. ఇక రోహిత్‌ పిక్క కండరాల గాయంతో జట్టుకు దూరం కావడంతో వన్డే సిరీసుకు రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.