FIR filed against MS Dhoni in Bihar's Begusarai know in detail : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరోసారి చిక్కుల్లో పడ్డాడు! బిహార్‌లోని బెగుసరైలో అతడితో సహా మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. న్యూ గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా కంపెనీ ఇచ్చిన చెక్కు బౌన్స్ అవ్వడంతో ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్ కేసు పెట్టింది. ఈ చెక్కు విలువ రూ.30 లక్షలని తెలిసింది. బెగుసరై సీజేఎం కోర్టులో సోమవారం విచారణ జరిగింది.
న్యూ గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా కంపెనీని ఎంఎస్ ధోనీ ప్రమోట్ చేశాడు. దాంతో అతడి పేరునూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. సోమవారం కోర్టు విచారణ పూర్తయ్యాక ఈ కేసును జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ మిశ్రా వద్దకు పంపించారు. జూన్ 28కి విచారణ వాయిదా వేశారు.
ఏంటీ కేసు?
న్యూ గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వద్ద ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్ రూ.30 లక్షల విలువైన ఎరువులను ఆర్డర్ చేసింది. ఆ సరుకును న్యూ గ్లోబల్ కంపెనీ సరఫరా చేసింది. అయితే సరఫరాదారు నిబంధనలను డీలర్ పాటించలేదన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో భారీమొత్తంలో సరకు అమ్ముడుపోలేదు. మిగిలిన ఎరువులను న్యూ గ్లోబల్ వెనక్కి తీసుకొని రూ.30 లక్షల విలువైన చెక్కు ఇచ్చింది. దానిని బ్యాంకులో డిపాజిట్ చేశాక బౌన్స్ అయింది. లీగల్ నోటీసు పంపించినా కంపెనీ స్పందించలేదు. దాంతో ఆ ప్రొడక్టును ప్రమోట్ చేసిన ఎంఎస్ ధోనీ సహా ఏడుగురిపై ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్ నీరజ్ కుమార్ నీరాలా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.