దేశంలో ప్రస్తుతం కేజీయఫ్ చాప్టర్: 2 హవా నడుస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కేజీయఫ్ ట్రైలర్‌లోని ‘వయొలెన్స్’ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ డైలాగ్‌తో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్  ఆటగాడు డేవిడ్ వార్నర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


కేవలం షార్ట్ వీడియో లాగానో, రీల్ లాగానో కాకుండా తన బ్యాటింగ్ వీడియోలను కూడా మిక్స్ చేసి మాషప్ లాగా చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై ఇప్పటికే ప్యాట్ కమిన్స్, కేండిస్ వార్నర్ కూడా కామెంట్ చేశారు. ఈ వీడియోలో తను కేజీయఫ్ హీరో యష్‌ను కూడా ట్యాగ్ చేశాడు. మరి రాకింగ్ స్టార్ స్పందిస్తాడో లేదో చూడాలి మరి.


ఇక ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ బాగానే రాణిస్తున్నాడు. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వార్నర్ 65 పరుగులు చేశాడు. మొదటి మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి విఫలం అయ్యాడు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం 61 పరుగులు చేసి ఫాంలోకి వచ్చాడు.