CWG 2022:  బర్మింగ్‌హామ్‌లో భారత్‌కు మరో నాలుగు పతకాలు వచ్చాయి. ఇవన్నీ అథ్లెటిక్స్‌ విభాగంలోనే రావడం విశేషం. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో ఎల్డోస్‌ పాల్‌ స్వర్ణం ముద్దాడాడు. అబ్దుల్లా అబూబాకర్‌ రజతం కైవసం చేసుకున్నాడు. 10 కిలో మీటర్ల నడకలో సందీప్‌ కుమార్‌ కాంస్యం కొల్లగొట్టాడు. మహిళల జావెలిన్‌ త్రోలో అన్నూ రాణి కంచు మోగించింది.


చరిత్రలో తొలిసారి


ట్రిపుల్‌ జంప్‌లో ఎల్డోస్‌ పాల్‌ నవ చరిత్రను ఆవిష్కరించాడు. కామన్వెల్త్‌ ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణం ముద్దాడిన తొలి భారతీయుడిగా అవతరించాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా 17.03 మీటర్లు గెంతి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతడి సహచరుడు అబూ బాకర్‌ 17.02 మీటర్లు దూకి వెండి పతకం సొంతం చేసుకున్నాడు. ఐదు రౌండ్లు ముగిశాక ఇద్దరు భారతీయులు 1, 2 స్థానాల్లో నిలవడం గమనార్హం. మరో ఆటగాడు ప్రవీణ్‌ చిత్రావల్‌ నాలుగో స్థానంతో ముగించాడు.






తొలి ట్రిపుల్‌ జంపర్‌


కామన్వెల్త్‌ క్రీడల్లో 17 మీటర్లకు పైగా దూకిన తొలి ట్రిపుల్‌ జంపర్‌ పాల్‌ కావడం విశేషం. మూడో ప్రయత్నంలో అతడీ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు యూజినీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో 16.79 మీటర్లతో సంచలనం సృష్టించాడు.  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఐదుగురు మాత్రమే అర్హత సాధించగా అందులో ఫైనల్‌కు చేరింది పాల్‌ ఒక్కడే.




అన్నూ రాణి.. ఎన్నాళ్లకో!


జావెలిన్‌ త్రోలో అన్నూ రాణి సరికొత్త చరిత్ర లిఖించింది. కామన్వెల్త్‌ జావెలిన్‌ క్రీడలో పతకం ముద్దాడిన తొలి భారతీయురాలిగా  నిలిచింది.  పోటీలో జావెలిన్‌ను 60 మీటర్లు విసిరి కాంస్యం అందుకుంది. కొన్నేళ్లుగా అనేక అంతర్జాతీయ క్రీడల్లో పతకం కోసం ఆమె శ్రమిస్తూనే ఉంది. ఇన్నాళ్లకు కల నెరవేరింది. 




నడక.. ఆహా!


సుదూర నడక (రేస్‌ వాక్‌)లో ఇండియాకు మరో పతకం రావడం అభిమానులను సంతోష పెట్టింది. టోక్యో ఒలింపియన్‌ సందీప్‌ 10,000 మీటర్ల నడకలో కాంస్యం ముద్దాడాడు. 38:49.21 నిమిషాల్లో రేసు ముగించి పర్సనల్‌ బెస్ట్‌ సాధించాడు. ఇదే పోటీలో 18 ఏళ్ల అమిత్‌ ఖత్రి 43:04.47 నిమిషాల్లో రేసు పూర్తి చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అరంగేట్రం క్రీడల్లోనే సీజనల్‌ బెస్ట్‌ అందుకొని ఆశలు రేపాడు.