WPL 2023, UPW-W vs DC-W:
దిల్లీ క్యాపిటల్స్ అద్భుతం చేసింది. అరంగేట్రం విమెన్ ప్రీమియర్ లీగు ఫైనల్‌కు చేరుకుంది. కనీసం రన్నరప్‌ను ఖాయం చేసుకుంది. బ్రబౌర్న్ వేదికగా యూపీ వారియర్జ్‌తో జరిగిన ఆఖరి లీగు మ్యాచులో విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 5 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (39; 23 బంతుల్లో 5x4, 2x6) దంచికొట్టింది. అలిస్ క్యాప్సీ (34; 31 బంతుల్లో 4x4, 1x6) గెలుపు ఇన్నింగ్స్ ఆడింది. అంతకు ముందు యూపీలో తాహిలా మెక్‌గ్రాత్ (58*; 32 బంతుల్లో 8x4, 2x6) వేగంగా హాఫ్ సెంచరీ చేసింది. కెప్టెన్ అలిసా హీలీ (36; 34 బంతుల్లో 4x4, 1x6) ఫర్వాలేదనిపించింది. అలిస్ క్యాప్సీ (3/26), రాధా యాదవ్ (2/28) తమ బౌలింగ్‌తో యూపీ పతనాన్ని శాసించారు.
బంతి, బ్యాటుతో క్యాప్సీ జోరు
యూపీ తమ ముందుంచిన ఈజీ టార్గెట్‌ను సాధ్యమైనంత వేగంగా ఛేజ్ చేసేందుకు దిల్లీ క్యాపిటల్స్ ట్రై చేసింది. ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ (21; 16 బంతుల్లో 4x4) పోటీపడి మరీ బాదేశారు. తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు కొట్టారు. 4.5వ బంతికి షెఫాలీని యశశ్రీ ఔట్ చేసి బ్రేకిచ్చింది. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి డీసీ 67/1తో నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ (3), మెగ్ లానింగ్‌ను ఒకే ఓవర్లో షబ్నిమ్ ఔట్ చేసి ఒత్తిడి పెంచింది.
ఆఖర్లో వికెట్లు
ఈ సిచ్యువేషన్లో అలిస్ క్యాప్సీ, మారిజానె కాప్ (31*; 34 బంతుల్లో 4x4, 1x6) సమయోచితంగా ఆడారు. దొరికిన బంతుల్ని బౌండరీకి పంపిస్తూనే మంచి వాటిని గౌరవించారు. నాలుగో వికెట్ 57 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం అందించారు. 16 ఓవర్లకు 130/3తో నిలిపారు. విజయానికి 24 బంతుల్లో 9 పరుగులు అవసరమైనప్పుడు ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన క్యాప్సీ స్టంపౌట్ అయింది. మరికాసేపటికే జొనాసెన్ (0) రనౌటై ఉత్కంఠ పెంచినా కాప్ గెలిపించేసింది.
కంట్రోల్ చేసిన దిల్లీ బౌలర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్జ్‌ను దిల్లీ బౌలర్లు చక్కగా అడ్డుకున్నారు. కఠినమైన లెంగ్తుల్లో బంతులేసి పరుగుల్ని నియంత్రించారు. వికెట్లు పడగొట్టారు. విధ్వంసకర బ్యాటర్ అలీసా హేలీ ఓపెనింగ్‌కు వచ్చి పవర్ ప్లేలో బంతికో పరుగు చేయడమే ఇందుకు ఉదాహరణ. శ్వేతా షెరావత్ (19)తో కలిసి ఆమె తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఐదో ఓవర్లో శ్వేతను రాధా యాదవ్ ఔట్ చేసింది. క్యాప్సీ వేసిన 9.6వ బంతికి హీలీ స్టంపౌట్ అయింది. అప్పటికి స్కోరు 63. మరికాసేపటికే సిమ్రన్ (11)ను రాధా పెవిలియన్ పంపించింది.
మెక్‌గ్రాత్ అదే ఫామ్!
ఆదుకుంటుందని భావించిన కిరన్ నవగిరె (2) జొనాసన్ బౌలింగ్‌లో స్టంపౌటైంది. దాంతో యూపీ 16 ఓవర్లకు 94/4తో స్ట్రాటజిక్ టైమౌట్‌కు వెళ్లింది. అయితే మరోవైపు తాహిలా మెక్‌గ్రాత్ తన ఫామ్ కొనసాగించింది. ఆచితూచి ఆడుతూనే దొరికిన బంతుల్ని బౌండరీకి పంపించింది. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేసింది. ఆఖరి రెండు ఓవర్లలో ధనాధన్ షాట్లు ఆడింది. అంజలి (3)తో కలిసి 15 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యంతో స్కోరును 138కి చేర్చింది. గ్రేస్ హ్యారిస్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీప్తి శర్మ, ఎకిల్‌స్టోన్ సైతం స్టంపౌట్ అవ్వడం గమనార్హం.