మ్యాచ్ సాగిందిలా...
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు బెత్ మూనీ 52 బంతుల్లో 10 ఫోర్లు, 1 భారీ సిక్సర్‌తో 74 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్ 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సుతో 43 పరుగులతో ధాటిగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించి గుజరాత్‌కు మంచి శుభారంభం అందించారు. యూపీ వారియర్స్ బౌలర్లలో ఎక్లెస్టోన్ మూడు వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది.
ఆరంభంలోనే బిగ్ షాక్
అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఆరంభంలో 4 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. గుజరాత్ పేసర్ షబ్నమ్ షకీల్ యూపీని మొదట్లోనే చావుదెబ్బ తీసింది. ఆమె వేసిన తొలి ఓవర్లోనే యూపీ సారథి అలిస్సా హీలి (4), చమరి ఆటపట్టు (0) పెవిలియన్ చేరారు. రెండో ఓవర్లోనే మరో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరె కూడా అవుటైంది. గ్రేస్ హరీస్ (1), శ్వేతా సెహ్రావత్ (8)లు కూడా త్వరగానే అవుట్ అయ్యారు. ఏడు ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్స్ 5 వికెట్లు కోల్పోయి 35 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే పూనమ్ ఖేర్ 36 బంతుల్లో 36 పరుగులు.. దీప్తి శర్మ 60 బంతుల్లో 9 ఫోర్లు నాలుగు సిక్సులతో 88 పరుగులు చేసి యూపీని విజయం దిశగా నడిపించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో నిలిచిన దీప్తి శర్మ విజయం కోసం కడదాక పోరాడింది. దీప్తికి ఇది వరుసగా మూడో అర్ధ శతకం కావడం విశేషం. ఆఖరి నాలుగు ఓవర్లలో 55 పరుగులు చేయాల్సి ఉండగా మన్నత్ కశ్యప్ వేసిన 17వ ఓవర్లో 12 పరుగులు రాగా మేఘనా సింగ్ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి. తనూజా కన్వర్ వేసిన 19వ ఓవర్లో 14 రన్స్ వచ్చినా ఆఖరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 26 పరుగులు అవసరమయ్యాయి. కానీ చివరి ఆరు బంతుల్లో యూపీ.. 17 మాత్రమే చేయగలిగింది. ఫలితంగా గుజరాత్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది.
గుజరాత్ బౌలర్లలో షబ్నమ్ షకీల్ నాలుగు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టింది. ఈ ఓటమితో యూపీ కథ ముగియగా ఆర్సీబీకి లైన్ క్లీయర్ అయింది. గుజరాత్‌కు మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ ఓటమితో యూపీ జట్టు లీగ్ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇప్పటికే దిల్లీ, ముంబయి జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.