WPL 2023 Points Table: 


విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రసవత్తరంగా సాగుతోంది. విజయాలు సాధించేందుకు జట్లన్నీ శక్తికి మించి శ్రమిస్తున్నాయి. కొన్ని  జట్లు ఆధిపత్యం చెలాయిస్తోంటే మరికొన్ని సాగిలపడిపోతున్నాయి. ముంబయి ఇండియన్స్‌ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మరోవైపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇంకా తొలి గెలుపు కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటి వరకు లీగులో ఏడు మ్యాచులు పూర్తయ్యాయి. మరి ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయి? ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారంటే?


మహిళల ప్రీమియర్‌ లీగులో ముంబయి ఇండియన్స్‌కు తిరుగులేదు. మొదటి మ్యాచ్‌ నుంచీ ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. అన్నీ కుదిరితే ఫైనల్‌ ఆడటం ఖాయమే! ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడగా మూడింట్లోనే గెలిచింది. అవీ భారీ విజయాలే! దీంతో 6 పాయింట్లు, 4.228 రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. 


ప్లే ఆఫ్స్‌ రేసులో పరుగులు 
దిల్లీ క్యాపిటల్స్‌ సైతం అదరగొడుతోంది. మూడు మ్యాచుల్లో రెండు గెలిచింది. 4 పాయింట్లు, 0.965 రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, యూపీ వారియర్జ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ప్లే ఆఫ్స్‌ రేసులో పరుగులు పెడుతోంది.


పాయింట్ల పట్టికలో యూపీ వారియర్జ్‌ మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడగా ఒకటి గెలిచి ఒకటి ఓడింది. తొలి పోరులో గుజరాత్‌ జెయింట్స్‌పై ఒక బంతి మిగిలుండగానే గెలిచింది. డీసీ చేతుల్లో పరాజయం చవిచూసింది. 2 పాయింట్లు, -0.864 రన్‌రేట్‌తో కొనసాగుతోంది.


గుజరాత్‌ జెయింట్స్‌ మొక్కవోని ఆత్మవిశ్వాసం 
ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా గుజరాత్‌ జెయింట్స్‌ మాత్రం బలంగా నిలబడుతోంది. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రత్యర్థులకు పోటీనిస్తోంది. తొలి మ్యాచ్‌ మినహాస్తే మిగతా రెండింట్లో అద్భుతంగా ఆడింది. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడగా రెండు ఓడి ఒకటి గెలిచింది. పాయింట్ల పట్టికలో 2 పాయింట్లు, -2.327 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది.


బెంగళూరుది విచిత్రమైన పరిస్థితి! 
విమెన్‌ ప్రీమియర్‌ లీగులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుది విచిత్రమైన పరిస్థితి! జట్టు నిండా స్టార్లున్నా గెలుపు తలుపులు తట్టడం లేదు. ఆడిన మూడింట్లోనూ 200 పైగా టార్గెట్లు ఛేదించాల్సి వచ్చింది. బౌలింగ్‌లో పూర్తిగా విఫలమవుతోంది. దాంతో పాయింట్లేమీ రాలేదు. -2.263 రన్‌రేట్‌తో ఆఖరి స్థానంలో నిలిచింది.