స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో కింగ్‌ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఒక సెంచరీతో పాటు మూడు అర్ధ శతకాలతో దూకుడు మీదున్నాడు. ఇదే చివరి ప్రపంచ కప్‌ అని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్న సమయంలో కోహ్లీ ఈసారి ఎలాగైనా జట్టును విశ్వ విజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే వన్డేల్లో 48 శతకాలు చేసిన విరాట్‌.. ఈ ప్రపంచకప్‌లో సచిన్‌ 49 శతకాల రికార్డును బద్దలు కొడతాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే సచిన్ రికార్డును బద్దలు కొట్టి.. విరాట్‌ 50వ శతకం ఎప్పుడు సాధిస్తాడో  లిటిల్‌ మాస్టర్‌, టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ చెప్పేశాడు. నవంబర్‌ 5న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో కింగ్‌ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టిస్తాడని గవాస్కర్ చెప్పేశాడు. ఆ రోజే ఎందుకంత ప్రత్యేకమో కూడా గవాస్కర్‌ వెల్లడించాడు. 

 

2023 నవంబర్ 5న విరాట్‌ కోహ్లీ తన 35వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. అదే రోజున  కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడనున్నాడు. తన జన్మదినం రోజునే  కోహ్లీ 50వ శతకాలతో కొత్త చరిత్ర లిఖిస్తాడని గవాస్కర్‌ అంచనా వేశాడు. ఇప్పటికే వన్డేల్లో కోహ్లీ 48 సెంచరీలు చేశాడు. అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో, నవంబర్ 2న శ్రీలంకతో టీమిండియా ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో కోహ్లీ ఒక సెంచరీ అయినా చేస్తే తన పుట్టినరోజు నాడు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ 50 శతకాలను పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే పుట్టినరోజున దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని సాధిస్తాడని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. 

 

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 286 వన్డేలు ఆడాడు. మొత్తం 274 ఇన్నింగ్స్‌ల్లో 58.16 సగటుతో 13437 పరుగులు చేశాడు. అందులో 48 సెంచరీలు, 69 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. వన్డేల్లో విరాట్‌ అత్యధిక స్కోరు 183 పరుగులు. ప్రస్తుత వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఐదు మ్యాచుల్లో 354 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం ఉంది. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో సచిన్‌ చేసిన 49 శతకాలకు చేరువగా వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 48 వన్డే సెంచరీలు ఉన్నాయి. ఈ మెగా టోర్నీలోనే మరో రెండు సెంచరీలు చేస్తే హాఫ్ సెంచరీ’ కొట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఆసీస్‌పై 85, న్యూజిలాండ్‌పై 95 పరుగులు చేసినా వాటిని శతకాలుగా మార్చలేకపోయాడు.

 

ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ 116 బంతుల్లో 85 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.  తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్‌పై 56 బంతుల్లో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్‌పై అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ 97 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ 104 బంతుల్లో 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విధంగా విరాట్ కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో 118.00 సగటుతో 354 పరుగులు చేశాడు. రానున్న మ్యాచ్‌ల్లోనూ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు.