Mohammed Shami Vs Pakistan Former cricketer Hasan Raza : ప్రపంచకప్(ODI World Cup 2023)లో భారత(Team India) జైత్రయాత్ర పాకిస్థాన్(Pakistan) మాజీ క్రికెటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు టీమిండియా అప్రతిహాత విజయాలతో ముందుకు సాగిపోతుంటే మరోవైపు పాక్ సెమీస్ చేరేందుకే వేరే జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజా(Hasan Raza) కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు దీనికి టీమిండియా పేసర్ మహ్మద్ షమీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. దీంతో ఈ ఘటన క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడిన ఈ పాక్ మాజీ క్రికెటర్ హసన్ రాజా శ్రీలంక, దక్షిణాఫ్రికాలను టీమిండియా బౌలర్లు తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడంపై అనుమానం వ్యక్తం చేశాడు. ఐసీసీ, బీసీసీఐ, భారత బౌలర్లు కలిసి ఏదో కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
అలాగే ప్రపంచకప్‌లో డీఆర్‌ఎస్ నిర్ణయాలు కూడా భారత జట్టుకే అనుకూలంగా వస్తున్నాయన్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఐసీసీ, బీసీసీఐ కలిసి టీమిండియా బౌలర్లకు ప్రత్యేకమైన బంతులు అందజేస్తున్నాయని, దీనిపై దర్యాప్తు జరిపించాలని హసన్ రాజా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. భారత బౌలర్లకు వేరే బాల్స్ ఇస్తున్నారని, వాటిని చెక్ చేయాలని కూడా డిమాండ్ చేశాడు. దీంతో హసన్ రాజా వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెటర్లతో సహా మాజీ క్రికెటర్లు కూడా భగ్గుమన్నారు. ఇప్పుడు మహ్మద్ షమీ హసన్ రాజా పేరు ప్రస్తావించకుండానే ఇచ్చి పడేశాడు. ఇదేమన్నా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా అని మండిపడ్డాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాస్త అయినా సిగ్గుపడాలని షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటపై ఫోకస్ పెట్టాలి కానీ ఇలాంటి బుర్ర తక్కువ మాటలు మాట్లాడొద్దని షమీ హెచ్చరించాడు. ఇతరుల విజయాలను చూసి కనీసం కొన్నిసార్లు అయినా ఆనందించాలని ఎద్దేవా చేశాడు. ఇది ఐసీసీ ప్రపంచకప్ అని.. మీ దేశంలోని గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా అని హసన్‌ను షమీ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు.నీకు అర్థమయ్యేలా వసీం అక్రమ్ ఇప్పటికే చెప్పాడని.. మీ దేశానికి చెందిన దిగ్గజ ఆటగాడు చెప్పిన విషయాన్ని అయినా నమ్మాలని హసన్‌రాజాకు షమీ సూచించాడు. హసన్ రజా పేరు ప్రస్తావించకుండానే అతడి వ్యాఖ్యలకు షమీ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడొద్దని కూడా హసన్‌కు షమీ సూచించాడు.
పాకిస్తాన్ మాజీ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ సైతం హసన్ రాజా వ్యాఖ్యలపై మండి పడ్డారు. దయచేసి మా పరువు, దేశం పరువు తీయద్దంటూ హసన్ రాజాకు కౌంటరిచ్చాడు. దీనికి ప్రస్తుతం ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న ‘జస్ట్ లైక్ వావ్’ వ్యాఖ్యను జోడించాడు. ప్రస్తుతం మహ్మద్ షమీ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. పాక్ క్రికెటర్‌కు భలే కౌంటరిచ్చావు బాసు అంటూ టీమిండియా అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో భారత్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో షమీకి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత చోటు దక్కించుకున్న షమీ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరుఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన షమీ.. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి 55 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికాను కూడా 100 పరుగుల లోపే ఆలౌట్ చేసింది. ఇలా టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శన.. పాపం హసన్‌కు నిద్రను దూరం చేసింది. దీంతోనే ఇలా పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడు.