Ishan Kishan Facing Jasprit Bumrah Bolling: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అప్రతిహాత విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్‌లో అడుగుపెట్టిన రోహిత్(Rohit Sharma) సేన ప్రపంచకప్ కల సాకారం చేసుకునేందుకు రెండే అడుగుల దూరంలో నిలిచింది. ఇప్పటివరకూ ఆడిన ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా... ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లోనూ గెలిచి లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆత్మ విశ్వాసంతో సెమీస్‌లో అడుగుపెట్టాలని చూస్తోంది.
ఇప్పటికే అడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన భారత జట్టు 16 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌తో జరగనున్న ఈ మ్యాచ్‌లో బెంచ్‌ను పరీక్షించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇషాన్ కిషన్‌ను బరిలోకి దించాలని సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్‌లో ఇషాన్ కిషన్ నెట్స్‌లో గాయపడడం మేనేజ్‌మెంట్‌ను, అభిమానులను ఆందోళన పరిచింది. ఈ ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా వేసిన షార్ట్ బాల్ కిషన్ కడుపుకు బలంగా తాకింది. దీంతో కిషాన్ తీవ్ర నొప్పితో నెట్స్‌లో కుప్పకూలాడు. దీంతో ఆటగాళ్లంతా ఒక్కసారి షాక్ అయ్యారు. అయితే ఫిజియోథెరపీ పరీక్షించాక కొంతసమయం తర్వాత కిషన్ కోలుకున్నాడు. తిరిగి కిషన్ ప్రాక్టీస్ ప్రారంభించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ ఎంట్రీతో కిషన్‌కు మళ్లీ తుది జట్టులో చోటు దక్కలేదు.
ఇక నెట్స్‌లో ఇషాన్ కిషన్‌తో పాటు శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ చెమటోడ్చారు. నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి ప్రసిద్ద్ కృష్ణను తుది జట్టులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితంతో పాయింట్ల టేబుల్‌లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు లేకపోయినప్పటికీ లీగ్ దశను ఒక్క ఓటమి కూడా లేకుండా ముగించాలంటే టీమిండియా గెలవాల్సిందే. పైగా ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్యా చూస్తే నెదర్లాండ్స్‌పై టీమిండియా గెలుపు పెదగా కష్టం కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశాలు కూడా లేకపోలేదు.
ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్‌లో 37వ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు ఆడాయి. అందులోనూ భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో తన నంబర్ వన్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా... ఈ ప్రపంచకప్‌లో తాను ఎలాంటి ఫామ్‌లో ఉందో చూపించింది. భారత క్రికెట్ జట్టు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో నంబర్ వన్ స్థానం భారత జట్టుకు కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే టీమ్ ఇండియా తన 8 మ్యాచ్‌లలో మొత్తం ఎనిమిదిట్లోనూ గెలిచి 16 పాయింట్లు సాధించింది. ఇంకా ఒక మ్యాచ్ భారత్‌కు మిగిలే ఉంది. ఈ టోర్నమెంట్‌లో మరే ఇతర జట్టు 16 పాయింట్లను చేరుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని జట్లూ కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఓడిపోయాయి. అందువల్ల టీమ్ ఇండియా ఇప్పుడు లీగ్ దశను పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో ముగించనుంది.