IND W vs SA W World Cup Final: మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11.. టైటిల్ ఫెవరెట్‌గా భారత్
india vs south africa Final | దక్షిణాఫ్రికాతో భారత్ మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ ఆడనుంది. 2025 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో తుది జట్లు ఎలా ఉంటాయి. డీవై పాటిల్ స్టేడియం పిచ్ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి.

మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు, దక్షిణాఫ్రికా జట్టు మధ్య డివై పాటిల్ స్టేడియంలో తలపడనున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా సెమీ-ఫైనల్‌లో చరిత్ర సృష్టించి ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 339 పరుగుల టార్గెట్ ఛేదించి టైటిల్ రేసులోకి వచ్చింది. మహిళల వన్డే చరిత్రలో ఇది అతిపెద్ద రన్ ఛేజింగ్. 7 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఓడించి భారత మహిళల జట్టు 3వసారి వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టు తొలిసారిగా ఫైనల్ చేరింది. టైటిల్ మ్యాచ్‌లో డివై పాటిల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ కీలకం కానుంది. రెండు జట్ల ప్లేయింగ్ 11 మరియు మ్యాచ్ ప్రిడిక్షన్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
సెమీఫైనల్‌లో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 127 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించింది. ఫైనల్‌లో కూడా మంధాన, హర్మన్ ప్రీత్, జెమీమా నుంచి ఈ తరహా ప్రదర్శనను ఆశిస్తున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ టోర్నమెంట్‌లో రెండు, మూడు మ్యాచ్ లలో కీలక ఇన్నింగ్స్ ఆడినా జట్టు ఓటమిపాలైంది. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో 89 పరుగులు చేసి ఆకట్టుకుంది.
ఓపెనింగ్ జోడీపైనే అందరి దృష్టి
ప్రతీకా రావల్ గాయంతో మరో ఓపెనర్ షెఫాలీ వర్మ భారత జట్టులోకి వచ్చింది. అయితే సెమీఫైనల్‌లో ఆమె కేవలం 10 పరుగులు చేసింది. ఫైనల్‌లో గెలవాలంటే షెఫాలీ, మరో ఓపెనర్ స్మృతి మంధానా మంచి ఓపెనింగ్ ఇవ్వడం చాలా ముఖ్యం. వీరిద్దరూ ఎటాకింగ్ బ్యాటింగ్ తో మొదలుపెట్టాలని అంతా ఆశిస్తున్నారు.
బౌలర్లకు సవాల్
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. మొదట్లోనే భారత బౌలర్లు ఆమెను కట్టడి చేయాలి. లేకపోతే ఆమె సమస్యగా మారవచ్చు. సెమీఫైనల్‌లో ఆమె 169 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ మొట్లోనే సఫారీల వికెట్లు తీస్తే ప్రయోజనం ఉంటుంది.
నల్లపురెడ్డి చరణి పరుగులు నియంత్రించడంలో సక్సెస్ అవుతోంది. దీప్తి శర్మ సెమీఫైనల్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చింది. కానీ టోర్నమెంట్‌లో ఆమె ఆల్ రౌండ్ ప్రదర్శనలో రాణించింది.
భారత మహిళా జట్టు vs దక్షిణాఫ్రికా మహిళా జట్టు హెడ్ టు హెడ్ రికార్డ్ (ODIలలో)
- మొత్తం మ్యాచ్‌లు - 34
- భారత్ గెలిచింది - 20
- దక్షిణాఫ్రికా గెలిచింది - 13
- డ్రా - 1
డివై పాటిల్ స్టేడియం పిచ్ రిపోర్ట్
డివై పాటిల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. కనుక ఫైనల్‌లో హై స్కోరింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలం. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజు వర్షం పడే అవకాశం ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 220. వాతావరణం విషయానికి వస్తే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు 25 శాతం వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.
భారత జట్టు యొక్క ప్లేయింగ్ 11 (అంచనా)
షెఫాలీ వర్మ, స్మృతి మంధానా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమాన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, నల్లపురెడ్డి చరణి, రేణుకా సింగ్.
దక్షిణాఫ్రికా జట్టు యొక్క ప్లేయింగ్ 11 (అంచనా)
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), టాజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, అన్నే బాష్, మారిజన్ కాప్, సినోలో జాఫ్తా (వికెట్ కీపర్), ఎనేరీ డర్క్సెన్, క్లో ట్రయాన్, నదీన్ డి క్లార్క్, అయబాంగా ఖాకా, నోన్‌కులలేకో మ్లాబా.
మహిళల ప్రపంచ కప్ ఫైనల్ విజేత ఎవరు..
ఈసారి కొత్త ప్రపంచ ఛాంపియన్ జట్టును చూడనున్నాం. ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్క టైటిల్ గెలవలేదు. హర్మన్‌ప్రీత్ కౌర్ అండ్ టీమ్ టైటిల్ గెలిచే అవకాశం 70 శాతం కంటే ఎక్కువ. భారత్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఇదే స్టేడియంలో ఓడించింది. హర్మన్‌ప్రీత్, జెమీమా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. హెడ్ టు హెడ్ గణాంకాల్లో భారత్ ముందంజలో ఉంది. అయితే దక్షిణాఫ్రికాపై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ జట్టు తొలిసారిగా ఫైనల్ ఆడుతోంది. దాంతో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ నవంబర్ 2న డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. టాస్ 2:30 గంటలకు వేస్తారు. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో, లైవ్ స్ట్రీమింగ్ జియోహోట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.





















