Kane Williamson Hits 30th Hundred: స్వదేశంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో  న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌  శ‌త‌కంతో గ‌ర్జించాడు. క్లాస్ ఇన్నింగ్స్‌తో అల‌రించిన కేన్ మామ 30వ సెంచ‌రీతో కొత్త రికార్డు సృష్టించాడు. భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli), క్రికెట్‌ లెజెండ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక సార్లు మూడంకెల స్కోర్ సాధించిన మూడో ఆట‌గాడిగా నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన వ్యక్తుల్లో 13వ స్థానానికి చేరుకున్నాడు. 51 శతకాలతో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తొలిస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ ఆటగాడు జోరూట్‌, మథ్యూహెడెన్‌ సైతం 30 శతకాలు చేశారు. విలియమ్సన్ మొత్తం 97 టెస్టుల్లో 169 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో తన అత్యధిక స్కోరు 251 పరుగులు. కేన్ మామ మ‌రో రెండు సెంచ‌రీలు కొడితే ఈ కివీస్ మాజీ సార‌థి స్టీవ్ స్మిత్‌ స‌ర‌స‌న నిలుస్తాడు.




 

మ్యాచ్‌ సాగుతుందిలా...

ఓవల్‌ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో  తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ ఆటముగిసే నికిసమయా 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే(1), టామ్‌ లాథమ్‌(20) స్వల్ప స్కోర్లకే పరిమితమైనప్పటికీ రచిన్‌ రవీంద్ర (118*), విలియమ్సన్‌(112*) జట్టును ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపారు. దక్షిణాఫ్రికా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మూడో వికెట్‌కు 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌ ద్వారా ఆరుగురు సఫారీ ప్లేయర్లు అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశారు.

మసాకా శకం రానుందా..?

అండర్‌-19 వరల్డ్‌కప్‌(U19 World Cup)లో యువ తారలు దూసుకొస్తున్నారు. ఇప్పటికే భారత్‌ తరపున ముషీర్‌ ఖాన్‌(Musheer Khan) వరుస సెంచరీలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా బౌలర్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును సౌతాఫ్రికా పేస్‌ బౌలర్ క్వేనా మపాకా(Kwena Maphaka) నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో మసాకా ఆరు వికెట్లు నేలకూల్చి ఈ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మసాకాకు ఇది మూడోసారి అయిదు వికెట్ల ప్రదర్శన. అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌ సింగిల్‌ ఎడిషన్‌లో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేయలేదు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసిన మసాకా... వెస్టిండీస్‌పై 38 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన మపాకా 18 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 17 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన మపాకా బుల్లెట్‌ వేగంతో నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లను నిశ్రేష్ఠులను చేస్తున్నాడు. ఇటీవలే జస్ప్రీత్‌ బుమ్రా కంటే వేగంగా యార్కర్లు సంధిస్తానని మసాకా సవాల్‌ కూడా చేశాడు.