ఒకే ఓవర్లో 3 వికెట్లు, టీమిండియాను ఆటాడుకున్న అమెరికా బౌలర్.. ఎవరీ Shadley Van Schalkwyk
Shadley Van Schalkwyk Profile: షాడ్లీ వాన్ షాల్క్‌విక్ చాలా ఏళ్ల కిందటే USAకు వలస వెళ్లాడు. అతడు ఆల్ రౌండర్ క్రికెటర్. ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను చిన్నాభిన్నం చేశాడు.

Who is Shadley Van Schalkwyk: ముంబై: టీ20 వరల్డ్ కప్ 2026 తొలి మ్యాచులోనే డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాకు ఓ అమెరికా బౌలర్ షాకిచ్చాడు. అతడు ఒకే ఓవర్లో ఏకంగా 3 భారత టాపార్డర్ వికెట్లు పడగొట్టి తన బౌలింగ్‌తో ఛాంపియన్ జట్టును ఛాలెంజ్ చేశాడు. అతను మరెవరో కాదు అమెరికాకు చెందిన ఆల్ రౌండర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్.
2024 టీ20 ప్రపంచ కప్‌లో దాదాపు ఇలాంటి సీనే ఒకటి జరిగింది. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడం ద్వారా సంచలనం సృష్టించాడు సౌరభ్ నేత్రావాల్కర్. 2026 T20 ప్రపంచ కప్‌లో ఈసారి సౌరభ్ కాదు, అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్ టీమిండియాకు షాకిచ్చాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో 4 వికెట్లు తీశాడు షాడ్లీ. ముఖ్యంగా ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి భారత జట్టుతో పాటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దుబేలను ఒకే ఓవర్‌లో అవుట్ చేయడం ద్వారా షాడ్లీ వార్తల్లో నిలిచాడు. షాడ్లీ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్లో 2వ బంతికి ఇషాన్ కిషన్ క్యాచ్ ఔట్ కాగా, అదే ఓవర్లో 5వ బంతికి తిలక్ వర్మ (25) మోనాంక్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి బంతికే ఆల్ రౌండర్ శివం దుబేను డకౌట్ చేసి చరిత్ర సృష్టించాడు షాడ్లీ వాన్ షాక్‌విక్. షాడ్లీ అమెరికాలో కాదు, దక్షిణాఫ్రికాలో జన్మించాడని అంతగా తెలియకపోవచ్చు. అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ.. అని క్రికెట్ అభిమానులు సెర్చ్ చేస్తున్నారు.
ఎవరీ షాడ్లీ వాన్ షాల్క్‌విక్..
అమెరికా క్రికెటర్ షాడ్లీ ఆగస్టు 5, 1988న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జన్మించాడు. అతను కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్, ఎడమ చేతి వాటం బ్యాటర్. ఆల్ రౌండర్ అయిన అతడు దక్షిణాఫ్రికాలోనే స్కూలింగ్ చేశాడు. వైన్‌బర్గ్ హైస్కూల్‌లో షాడ్లీ చదివాడు. ఈగల్స్, ఫ్రీ స్టేట్ తరపున మీడియం పేసర్‌గా ఆడాడు. జాకస్ కలిస్, అలన్ లాంబ్ వంటి పూర్వ విద్యార్థులు అయిన ఫేమస్ వైన్‌బర్గ్ బాయ్స్ హైస్కూల్ నుండి వచ్చాడు. 2006లో తన పాఠశాల జట్టుతో పాకిస్తాన్ పర్యటనలో బ్యాట్‌తో ఆకట్టుకున్న తర్వాత దక్షిణాఫ్రికా అకాడమీలోకి డ్రాఫ్ట్ చేశారు. తరువాత దక్షిణాఫ్రికా డొమెస్టిక్ క్రికెట్‌లో అంచెలంచెలుగా ఎదిగాడు.
ఫిబ్రవరి 2008లో వెస్ట్రన్ ప్రావిన్స్ తరపున లిస్ట్ Aలో అరంగేట్రం చేశాడు. 9 నెలల తర్వాత తన మొదటి ఫస్ట్-క్లాస్ ప్రదర్శన చేశాడు. ఈగల్స్ 2009 ప్రో20 సిరీస్‌లోని ప్రతి మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ప్రారంభ ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 జట్టులో భాగమయ్యాడు.
కానీ దాదాపు పదేళ్ల కిందట షాడ్లీ షాల్క్‌విక్ దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు వలస వెళ్లాడు. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ తరపున మైనర్ లీగ్ క్రికెట్‌లో, తరువాత మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో మంచి ప్రదర్శన చేశాడు. దాంతో ఏప్రిల్ 2024లో USA జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ముఖ్యంగా ఒత్తిడిలో అతడు బాగా రాణిస్తాడని పేరుంది. దాంతో 2024 T20 ప్రపంచ కప్‌లో అవకాశం దక్కించుకున్నాడు.
షాడ్లీ ఫ్రాంచైజ్ క్రికెట్‌లో కూడా యాక్టివ్‌గా ఉన్నాడు. అతను ILT20లో అబుదాబి నైట్ రైడర్స్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు USA తరపున 13 ODIలు, 14 T20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 17 వికెట్లు తీయగా బెస్ట్ 4/20. టీ20లలో 15 వికెట్లు పడగొట్టగా బెస్ట్ బౌలింగ్ 3/35గా ఉంది. 124 లిస్ట్ ఏ క్రికెట్ మ్యాచ్‌లాడిన షాడ్లీ 161 వికెట్లు పడగొట్టగా, బెస్ట్ బౌలింగ్ 5/19 నమోదు చేశాడు.





















