IND vs ENG 3rd Test Lords Pitch Report: భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ (IND vs ENG Test Series)లో ఇప్పటివరకు బ్యాటింగ్ డామినేట్ చేసింది. రెండు మ్యాచ్‌లలోనూ భారీగానే పరుగులు వచ్చాయి, చాలా మంది ఆటగాళ్ళు సెంచరీలు, అర్ధ సెంచరీలతో దుమ్మురేపారు. రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఇరు జట్లు చెరో విజయంతో ఉన్నాయి. ఇప్పుడు మూడో టెస్ట్ లార్డ్స్ (IND vs ENG 3rd Test) మైదానంలో ఆడాల్సి ఉంది. మొదటి 2 టెస్ట్ మ్యాచ్‌లలో చాలా పరుగులు వచ్చాయి. ఇప్పుడు మూడో మ్యాచ్‌కు ముందు అసలు లార్డ్స్ పిచ్ ఎలా ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందా బౌలింగ్‌తో బౌలర్లు మ్యాజిక్ చేస్తారా ఆనేది ఇక్కడ చూద్దాం.
మొదటి రెండు మ్యాచ్‌లలో 3,365 పరుగులుమొదటి టెస్ట్ లీడ్స్ మైదానంలో జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ 465 పరుగులు చేసింది, అయితే భారత్ రెండో ఇన్నింగ్స్ 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ 373 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మొదటి మ్యాచ్‌లో రెండు జట్లు రెండు ఇన్నింగ్స్‌లలో మొత్తం 1,673 పరుగులు వచ్చాయి.
రెండో టెస్టు మ్యాచ్ ఎడ్జ్బాస్టన్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ 407 పరుగులు చేసింది. టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను 427 పరుగులకు డిక్లేర్ చేసింది. 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది.
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం 1,673 పరుగులు వస్తే, రెండో టెస్టు మ్యాచ్ నాలుగు ఇన్నింగ్స్‌లలో మొత్తం 1,692 పరుగులు వచ్చాయి. ఈ విధంగా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లలో మొత్తం 3,365 పరుగులు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ రెండు మ్యాచ్‌లలో మొత్తం 11 సెంచరీ ఇన్నింగ్స్‌లు చూశాం.
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున ఐదు బ్యాటర్లు సెంచరీలు చేశారు. ఇది టెస్ట్ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘటన. వీరిలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా ఐదుగురు బ్యాటర్లు శతకాలు సాధించారు. మొదటి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్(101), శుభ్‌మన్‌గిల్(147), రిషభ్ పంత్(134) సెంచరీలు చేస్తే రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(137), రిషభ్ పంత్ (118) సెంచరీలు చేశారు.
మొదటి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరఫున ఇద్దరు బ్యాటరర్లు కూడా సెంచరీలు చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్(106) సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో బెన్‌డకేట్(149) సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్‌గిల్(269) డబుల్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ తరఫున మొదటి ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేశారు. హారీ బ్రూక్ 158 పరుగులు చేస్తే స్మిత్ 184 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత్ తరఫున గిల్ 161 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తరఫున సెంచరీలు నమోదు కాలేదు. .
లార్డ్స్ పిచ్ ఎలా ఉంటుంది?మూడో టెస్ట్ కోసం లార్డ్స్ పిచ్ సిద్ధమైంది. ఈ పిచ్ చూడటానికి గడ్డి కనిపిస్తోంది. లార్డ్స్ మైదానం పిచ్‌లో గడ్డి ఉండటం వల్ల ఫాస్ట్ బౌలర్లకు మంచి స్వింగ్ లభిస్తుంది. పిచ్‌లో గడ్డి ఉండటం వల్ల అసాధారణ బౌన్స్ చూడవచ్చు, దీని కారణంగా తొలుత బ్యాటింగ్ చేయడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ పిచ్ పాతబడిన కొద్దీ బ్యాటింగ్ చేయడం సులభం అవుతుంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 310 పరుగులు వస్తున్నాయి. చరిత్రలో ఇక్కడ 344 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేదు. అందుకే ఇక్కడ టాస్ గెలిచిన వాళ్లకు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.