Virat Kohli Storm: అభిమానులకు బర్త్ డే కానుక ఇచ్చిన కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వన్డేలో కివీస్ పై భారత్ ఘన విజయం
ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ మెరుపు అర్ధ శతకం, గుర్నూర్ బ్రార్ బౌలింగ్ తో కివీస్ పై భారత్ ఘన విజయం సాధించింది.

Kohli Shines In Auckland: భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన 38వ పుట్టినరోజుకు ఒక రోజు ముందే మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత యువ పేస్ దళం కేవలం 40.2 ఓవర్లలోనే 185 పరుగులకే కుప్పకూల్చింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (38) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అర్ష్ దీప్ సింగ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం వర్షం కారణంగా సవరించిన లక్ష్యాన్ని భారత్ కేవలం 22.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి, సునాయాసంగా ఛేదించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్బ్ ఫిఫ్టీ (51 బంతుల్లోనే 74, 13 ఫోర్లు, ఒక సిక్సర్) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో జాకబ్ డఫీకి మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి వన్డే ఈనెల 7న వెల్లింగ్టన్ వేదికగా జరుగుతుంది.
Eden Park, graced by a @imVkohli special 💙 #TeamIndia | #NZvIND https://t.co/WTwONltwNw
— BCCI (@BCCI) November 4, 2026
ఆరంభంలోనే షాక్..
చిన్న టార్గెట్ తోనే టీమిండియా బరిలోకి దిగినప్పటికీ, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (0) ఆరు బంతులు ఆడి డకౌట్ కావడంతో ఆదిలోనే షాక్ తగిలింది. ఈ దశలో తన అనుభవన్నంతా రంగరించిన కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టన్నింగ్ ఫిప్టీ బాది కివీస్ బౌలర్లను హడలెత్తించాడు. కోహ్లీ తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్‌లు, పుల్ షాట్లతో అలరించాడు. బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్‌లో నిలబడి కొట్టిన పంచ్ డ్రైవ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. వరుస బౌండరీలతో మైదానాన్ని హోరెత్తించి స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (37)తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈక్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ చేయగా, వన్డేల్లో అతనికిది 80వ అర్ధ శతకం కావడం విశేషం. అయితే చివర్లో గిల్, కోహ్లీలతోపాటు శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ డకౌట్ అయి త్వరగా వెనుదిరిగినప్పటికీ, కేఎల్ రాహుల్ (3), నమన్ ధీర్ (5) చివరికంటా క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.
Leading the charge with the ball 💪 Anshul Kamboj bags the Player of the Match honours for his exceptional bowling performance in the 1st ODI against New Zealand 💙 Scorecard ▶️ https://t.co/iZN2Y53Nur #TeamIndia | #NZvIND https://t.co/8Nho0HwiKf
— BCCI (@BCCI) November 4, 2026
కివీస్ బెంబేలు..
ఇక టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ ను భారత బౌలర్లు హడలెత్తించారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి అగ్రశ్రేణి పేసర్లు లేకపోయినా పంజాబ్ ద్వయం అర్ష్‌దీప్ సింగ్ (4/70), 6 అడుగుల 5 అంగుళాల పొడవైన గుర్నూర్ బ్రార్ (3/44) బ్యాటర్లను వణికించారు. బౌన్స్, పేస్‌తో బ్యాటర్లను భయపెట్టిన గుర్నూర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నమ్మకాన్ని నిలబెట్టాడు. మరో ఎండ్‌లో అన్షుల్ కంబోజ్ 10 ఓవర్లలో ఏకంగా 46 డాట్ బాల్స్ వేసి కేవలం 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పూర్తిగా కట్టడి చేశాడు. మూడు మ్యాచ్‌ల అనుభవం కూడా లేని యువ బౌలర్లతో రిస్క్ చేసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వేసిన ఎత్తుగడ సూపర్ సక్సెస్ అయింది. పవర్‌ప్లే ముగిసిన తర్వాత బౌలింగ్‌కు వచ్చిన గుర్నూర్ బ్రార్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో న్యూజిలాండ్ నడ్డి విరిచాడు. ప్రమాదకర టిమ్ సీఫెర్ట్ (38)ను షార్ట్ పిచ్ బంతితో బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే టెస్ట్ కెప్టెన్ టామ్ లాథమ్ (3) కొట్టిన వేగవంతమైన షాట్‌ను తన ఫాలోత్రూలో ఎడమచేత్తో అద్భుతమైన రిఫ్లెక్స్ క్యాచ్‌గా మలిచి పెవిలియన్ చేర్చాడు. డేరిల్ మిచెల్ (28)ను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ద్వయం రనౌట్ చేయగా, అన్షుల్ కంబోజ్ వరుసగా కెప్టెన్ మిచెల్ శాంట్నర్, నాథన్ స్మిత్‌లను ఔట్ చేశాడు. చివర్లో బ్లెయిర్ టిక్నర్ 34 పరుగులు చేయడంతో కివీస్ 185 పరుగులు చేయగలిగింది.
ట్రెండింగ్ వార్తలు



















