కుడిచేతి వాటం బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో మూడు హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను పాకిస్తాన్‌పై 82 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. భారతదేశానికి అసంభవంలా కనిపించిన విజయాన్ని అందించాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో కోహ్లి ఫాంతో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు తనకు మెసేజ్ పంపిన ఏకైక వ్యక్తి ఎంఎస్ ధోని అని కోహ్లీ వెల్లడించాడు.


ఆర్సీబీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కోహ్లి ఫాంలో లేని సమయంలో ధోని తనకు ఏమి టెక్స్ట్ చేసాడో తెలిపాడు. "నన్ను నిజంగా సంప్రదించిన ఏకైక వ్యక్తి  మహేంద్ర సింగ్ ధోని మాత్రమే. నా కంటే సీనియర్ అయిన వారితో నేను ఇంత బలమైన సంబంధాన్ని కలిగి ఉండగలనని తెలుసుకోవడం నాకు చాలా వరం. ఇది పరస్పర గౌరవంపై ఆధారపడిన స్నేహం." అని కోహ్లి ఆర్సీబీ పోడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.


"మనం బలంగా ఉండాలని, బలమైన వ్యక్తిగా మనల్ని చూడాలని కోరుకుంటున్నప్పుడు మీరు ఎలా ఉన్నారని ప్రజలు అడగడం మర్చిపోతారు? అని ధోని ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. అది నాకు బాగా టచ్ అయింది." అన్నాడు. విరాట్ కోహ్లి తన 71వ అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. అతను ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఈ ఘనతను సాధించాడు.


అక్టోబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. జింబాబ్వేకు చెందిన సికందర్ రజా, దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ ఈ అవార్డుకు నామినేట్ కాగా వీరిని వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ ఈ అవార్డును గెలుచుకున్నాడు.