భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆఖరి మెట్టుపై టీమిండియా బోల్తా పడింది. ఇక మరో ఆరు నెలల్లో జరిగే టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు భారత జట్టు ప్రణాళికలు రచిస్తోంది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమిని.. టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని మరిపించాలని టీమిండియా కోరుకుంటోంది. అయితే ఈ టీ 20 ప్రపంచకప్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2022లో జరిగిన టీ20 ప్రపంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు ఓడిపోయిన త‌రువాత ఈ ఫార్మాట్‌లో టీమ్ఇండియా త‌రుపున కోహ్లీ మ‌రో టీ20 మ్యాచ్ ఆడలేదు. దీంతో టీ 20 క్రికెట్‌కు విరాట్‌ వీడ్కోలు పలికినట్లేనని... అతడి స్థానంలో మరో ఆటగాడి ఎంపికపై అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ కసరత్తులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

 

మరో ఆరు నెలల్లో వెస్టిండీస్‌, అమెరికాల్లో టీ20 వరల్డ్‌కప్‌ జరుగబోతోంది. ఈ మెగా టోర్నీలో కోహ్లీ అవసరం ఉండకపోవచ్చని చాలామంది వ్యాఖ్యానిస్తుండడం  కలకలం సృష్టిస్తోంది. విరాట్‌ను వన్‌డౌన్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే బీసీసీఐ భావిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. విరాట్‌ కోహ్లీ నిజానికి ఈ ఇద్దరు సీనియర్లు గతేడాది పొట్టి వరల్డ్‌కప్‌ సెమీస్‌ అనంతరం ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కూడా ఆడలేదు. అలాగే రాబోయే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ల్లోనూ విరాట్‌, రోహిత్‌, బుమ్రా ఆడడం లేదు. అయితే పొట్టి వరల్డ్‌కప్‌లో మాత్రం రోహిత్‌, బుమ్రా ఆడడం ఖాయమేనని, కానీ విరాట్‌కు మాత్రం చోటు దక్కకపోవచ్చని కథనాలు వస్తున్నాయి. టీ 20 మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే జ‌ట్టును సిద్ధం చేసే ప‌నిలో బీసీసీఐ నిమ‌గ్నమైంది. ఇందుకోసం ఇటీవ‌ల ఢిల్లీలో స‌మావేశ‌మైన బీసీసీఐ అధికారులు, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్రవిడ్‌, సెల‌క్షన్ క‌మిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌ల‌తో క‌లిసి పొట్టి ప్రపంచ‌క‌ప్ కోసం రోడ్ మ్యాప్‌ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది.

 

నిజానికి విరాట్‌ కోహ్లీకి టీ20, ఐపీఎల్‌లో మెరుగైన రికార్డులే ఉన్నా.. ప్రత్నామ్నాయ ఆటగాడి కోసం బీసీసీఐ చూస్తోంది. వన్‌డౌన్‌లో దిగే ఆటగాడు ఆరంభం నుంచే ఎటాకింగ్‌ గేమ్‌ ఆడాలని బోర్డు కోరుకొంటోంది. ఒకవేళ విరాట్‌ కోహ్లీని టీ 20 ప్రపంచకప్‌నకు పరిగణనలోకి తీసుకోకపోతే అతడి స్థానంలో ఇషాన్ కిష‌న్‌ను ఆడించే అవ‌కాశాల‌ు ఉన్నాయని  బీసీసీఐ అధికారి తెలిపారు. ఆరంభం నుంచి ఇషాన్ కిష‌న్ ధాటిగా ఆడ‌గ‌ల‌డ‌ని, లెఫ్ట్ హ్యాండ‌ర్ కావ‌డంతో జ‌ట్టు కాంబినేష‌న్ సైతం అద్భుతంగా కుదిరే అవ‌కాశం ఉంద‌న్నాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో ప్రద‌ర్శన కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని చెప్పాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జ‌ట్టు త‌రుపున ఓపెనింగ్ స్థానంలో ఆడ‌తాడు కాబ‌ట్టి అత‌డిని ఓపెనింగ్ స్థానంలో అయితే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేమ‌ని చెప్పాడు. ఇప్పటికే చాలా మంది ఓపెన‌ర్లు అందుబాటులో ఉన్నార‌న్నారు. ఇక ఈ ఫార్మాట్‌లో ఏదైన నిర్ణ‌యం తీసుకునే ముందు మాత్రం విరాట్ కోహ్లీతో త‌న భ‌విష్యత్తు గురించి సంప్రదించిన త‌రువాత‌నే ఉంటుంద‌ని చెప్పారు. ఇషాన్‌ ఈ ఫార్మాట్‌లో 32 మ్యాచ్‌లు ఆడి 796 పరుగులు సాధించాడు.