Ind Vs NZ Odi Update: సచిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వన్డే క్లబ్బులో కోహ్లీ.. ఇరుజట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
300వ వన్డే మ్యాచ్ ను కోహ్లీ ఆడుతున్నాడు. 2008 నుంచి ఆడుతున్న కోహ్లీ.. వన్డేల్లో 14,085 పరుగులు చేశాడు. ఇప్పటివరకూ అజారుద్దీన్, సచిన్ , ద్రావిడ్, గంగూలీ, యువరాజ్, ధోనీ 300 వన్డేలు ఆడారు.

ICC Champions Trophy 200 Live Updates: భారత టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశాడు. భారత కెప్టెన్ గా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రోహిత్ 7వ స్థానంలో ఉన్నాడు. సచిన్ అతని కంటే ముందు 6వ ప్లేస్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ 68 పరుగులు చేస్తే, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తాడు. సచిన్ టెండూల్కర్ 73 వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పని చేశాడు. ఇందులో 37.75 సగటుతో 2,454 పరుగులు సాధించాడు. ఈ కాలంలో 6 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశాడు. ఇక రోహిత్ శర్మ 53 వన్డేల్లో 53.04 సగటుతో, 2387 పరుగులు సాధించాడు. ఇందులో హిట్ మ్యాన్ 5 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు చేశాడు. జాబితాను పరిశీలిస్తే మహేంద్ర సింగ్ ధోనీ 6,641 పరుగులతో, విరాట్ కోహ్లీ 5,449 రన్స్ తో , మహ్మద్ అజారుద్దీన్ 5,239 పరుగులతో, సౌరవ్ గంగూలీ 5,082 రన్స్ తో, రాహుల్ ద్రవిడ్ 2,658 పరుగులతో ఈ జాబితాలో టాప్ -5లో ఉన్నారు.
300వ వన్డే క్లబ్బులో కోహ్లీ..
ఇక ఈ మ్యాచ్ ద్వారా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన క్లబ్బులోకి ఎంటర్ అయ్యాడు. కెరీర్లో 300వ వన్డే మ్యాచ్ ను ఆడుతున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 14,085 పరుగులు సాధించాడు. ఇప్పటివరకూ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, ధోనీ మాత్రమే భారత్ తరపున 300 వన్డేలు ఆడారు. వారి తర్వాత 300వ వన్డే ఆడుతున్న ఏడో భారత ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. ఇక కోహ్లీ మరో 150 పరుగులు చేస్తే, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ (18,425), శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర (14,234) పరుగులు చేశారు. తాజాగా సంగక్కర రికార్డుపై కోహ్లీ కన్నేశాడు.
చెరో మార్పు చేసిన ఇరుజట్లు..
ఇక న్యూజిలాండ్ తో మ్యాచ్ తో భారత్ ఒక మార్పు చేసింది. పేసర్ హర్షిత్ రాణా ప్లేసులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆడిస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ కిదే తొలి మ్యాచ్ కావడం విశేషం. కివీస్ జట్టులో ఎక్కువమంది లెఫ్టాండర్లు ఉన్నందున, వరుణ్ ను ఆడిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కివీస్ కూడా తుదిజట్టులో ఒక మార్పు చేసింది. ఓపెనర్ డేవన్ కాన్వే స్థానంలో డారిల్ మిషెల్ బరిలోకి దిగనున్నారు. ఇక రోహిత్ ఈ మ్యాచ్ లోనూ టాస్ ఓడిపోయాడు. దీంతో వరుసగా 13వ సారి టాస్ ఓడిపోయినట్లయ్యింది. దీంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుండగా, న్యూజిలాండ్ బౌలింగ్ చేయనుంది. ఈ మెగాటోర్నీలో తొలిసారి భారత్ బ్యాటింగ్ చేస్తోంది.
భారత తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.