Team India Prize Money: భారత జట్టుకు ప్రైజ్ మనీ ఎంత లభించింది.. ICC కంటే ఎక్కువ మొత్తం ఇచ్చిన BCCI
ODI World Cup 2025 Winner | 2025 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుపై కనక వర్షం కురిపించారు. బీసీసీఐ, ఐసీసీ టీమిండియాకు ఇచ్చిన ప్రైజ్ మనీ వివరాలిలా ఉన్నాయి.

Prize money for Team India: ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 52 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా టీమిండియా ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ప్రపంచ కప్ ఫైనల్ గెలిచిన తర్వాత భారత జట్టుపై ప్రశంసల వర్షంతో పాటు వారి కష్టానికి తగ్గట్లుగా కనక వర్షం కురుస్తోంది. ప్రపంచ కప్ గెలిచినందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుంచి భారత జట్టుకు ప్రైజ్ మనీ లభించింది. అదే సమయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) సైతం టీమిండియాకు, సహాయక సిబ్బందికి పెద్ద బహుమతిని ప్రకటించింది. ICC ప్రైజ్ మనీ కంటే BCCI ప్రైజ్ మనీ చాలా ఎక్కువ.
ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు ICC ప్రైజ్ మనీ
మహిళల ప్రపంచ కప్ 2025 మొత్తం ప్రైజ్ మనీ 13.88 మిలియన్ అమెరికా డాలర్లు. అయితే ఇది భారత కరెన్సీలో దాదాపు 123 కోట్ల రూపాయలు. ఈ ప్రైజ్ మనీలో ఫైనల్ గెలిచినందుకు ఇండియాకు 4.48 మిలియన్ US డాలర్లు లభించగా.. ఇది దాదాపు రూ.40 కోట్లు. ఈసారి ప్రపంచ కప్‌లో ICC ఇతర జట్లకు సైతం భారీ ప్రైజ్ మనీని అందించింది.
ICC ఈసారి ప్రపంచ కప్‌లో 2022లో జరిగిన మహిళల ప్రపంచ కప్‌తో పోలిస్తే ప్రైజ్ మనీని ఏకంగా 4 రెట్లు పెంచింది. గత ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోగా, అప్పుడు ఆసీస్ జట్టుకు దాదాపు 12 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు దాదాపు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకుంది.
మహిళల ప్రపంచ కప్ 2025 గెలిచినందుకు భారత మహిళల క్రికెట్ జట్టుకు లభించిన ప్రైజ్ మనీ పురుషుల ప్రపంచ కప్ 2023లో లభించిన ప్రైజ్ మనీ కంటే ఎక్కువ. 2023లో జరిగిన పురుషుల ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది.ఇది భారత్‌లోనే జరిగింది. ఈ ఫైనల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ ప్రపంచ కప్ మొత్తం ప్రైజ్ మనీ 89 కోట్ల రూపాయలు కాగా.. ఈసారి మహిళల ప్రపంచ కప్ 2025 మొత్తం ప్రైజ్ మనీ 123 కోట్ల రూపాయలకు పెంచారు.
ICC కంటే ఎక్కువ ప్రైజ్‌మనీ ఇచ్చిన BCCI
మహిళల ప్రపంచ కప్ 2025 గెలిచిన భారత మహిళల జట్టుకు ICC నుండి ప్రైజ్ మనీ రూపంలో దాదాపు 40 కోట్లు వచ్చాయి. అదే సమయంలో BCCI టీమ్ ఇండియాకు 51 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఈ మొత్తం భారత ప్లేయర్లు, కోచింగ్ సిబ్బందికి, సహాయక సిబ్బందికి చెందుతుంది. భారత జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు మొత్తం 91 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ లభించింది. పురుషుల వన్డే వరల్డ్ కప్ విజేతకు రూ.12 కోట్లు మాత్రమే ఐసీసీ ఇవ్వగా.. తాజాగా విజేతగా నిలిచిన మహిళల జట్టుకు రూ.40 కోట్ల మేర ప్రైజ్ మనీ ఇచ్చి వారిని ప్రోత్సహించింది. క్రికెట్లో పురుషు క్రికెటర్లు, మహిళా క్రికెటర్లకు ప్రైజ్ మనీలో భారీ వ్యత్యాసం చూపడాన్ని అంతా స్వాగతిస్తున్నారు.





















