T20ల్లో టీమిండియా డకౌట్ కింగ్ ఎవరు? రోహిత్, కోహ్లీ సహా టాప్ 5 ప్లేయర్స్ వీరే
టీమిండియా స్టార్ బ్యాటర్లు అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ 5లో ఉన్నారు.

టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీ20 వరల్డ్ కప్ 2026 బరిలోకి దిగింది. అయితే ఈ ప్రపంచ కప్ లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా 3 మ్యాచులలో డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచులో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. అయితే టీ20ల్లో టాప్ బ్యాటర్లుగా అయినప్పటికీ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సైతం ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక డకౌట్లు అయిన బ్యాటర్ల జాబితాలో ఉన్నారు. ఇండియాకు చెందిన కొందరు దిగ్గజ బ్యాటర్ల పేరిట అత్యధిక 'డక్' (0 పరుగులకే అవుట్ కావడం) అయిన రికార్డులు ఉన్నాయి.
రోహిత్ శర్మ
ఈ జాబితాలో అందరికంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 2007 నుండి 2024 వరకు 159 టీ20 మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ రోహిత్, 12 సార్లు డకౌట్ అయ్యాడు. రోహిత్ 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 4231 పరుగులు చేశాడు. అయితే, టీ20 వంటి ఫార్మాట్‌లో దూకుడుగా ఆడటం వల్ల ఓపెనర్లు త్వరగా అవుట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సంజూ శాంసన్
ఈ విషయంలో రెండో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఉన్నాడు. శాంసన్ 2015 నుండి 2026 మధ్య ఆడిన 58 మ్యాచ్‌లలో 7 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. శాంసన్ 1100 పరుగులు చేయగా, అతడి స్ట్రైక్ రేట్ దాదాపు 149గా ఉంది. శాంసన్ సాధారణంగా డాషింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. కానీ త్వరగా వికెట్లు సమర్పించుకోవడం అతడికి మైనస్ పాయింట్.
విరాట్ కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. కోహ్లీ 2010 నుండి 2024 వరకు 125 టీ20 మ్యాచ్‌లలో 7 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయినప్పటికీ కోహ్లీ పేరిట 4,188 పరుగులు ఉన్నాయి. అతడి సగటు దాదాపు 49గా ఉంది. ఈ ఫార్మాట్‌లోనూ కోహ్లీ బెస్ట్ బ్యాటర్ గా కొనసాగాడు.
అభిషేక్ శర్మ
ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ కూడా ఈ జాబితాలోకి వచ్చేశాడు. యువ ఓపెనర్ 2024 నుండి 2026 మధ్య ఆడిన 41 మ్యాచ్‌లలో 6 సార్లు డకౌట్ అయ్యాడు. అభిషేక్ స్ట్రైక్ రేట్ 190 కంటే ఎక్కువగా ఉండటం అతడి దూకుడు బ్యాటింగ్ శైలిని తెలుపుతుంది. ఈ వరల్డ్ కప్ లోనే 3 సార్లు అభిషేక్ ఖాతా తెరవకుండా వికెట్ కోల్పోయాడు.
సూర్యకుమార్ యాదవ్
ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ అవాంఛనీయ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సూర్య 2021 నుండి 2026 వరకు ఆడిన 108 మ్యాచ్‌లలో 6 సార్లు డకౌట్ అయ్యాడు. ఇటీవల వరుసగా డకౌట్లు, విఫలమైన సూర్య మళ్లీ పుంజుకున్నాడు. అయినప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ 3192 పరుగులు చేశాడు. ఎన్నో మ్యాచ్‌లలో టీమిండియాను గెలిపించాడు.





















