T20 World Cup 2026 Super 8 Teams: భారత్, లంక సహా 5 జట్లు కన్ఫామ్.. ఆసీస్, పాక్ సూపర్ 8కు చేరే ఛాన్స్ ఉందా?
T20 World Cup 2026 Super 8 Teams: రెండు ఆతిథ్య జట్లు (ఇండియా, శ్రీలంక) సహా ఐదు జట్లు T20 ప్రపంచ కప్ సూపర్ 8లో తమ స్థానాలను కన్ఫామ్ చేసుకున్నాయి.

ఈసారి టీ20 వరల్డ్ కప్ 2026 మొత్తం 20 జట్లతో జరుగుతోంది. వీటిని 5 జట్ల చొప్పున 4 గ్రూపులుగా ఐసీసీ విభజించింది. ప్రస్తుతం గ్రూప్ స్టేజ్ చివరి దశకు వచ్చేసింది. రెండు ఆతిథ్య దేశాలు (ఇండియా, శ్రీలంక) సహా 5 దేశాల జట్లు సూపర్-8లో తమ స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాయి. ఈరోజు మరో 2 జట్లు సూపర్-8 స్థానాలు పొందే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా టోర్నీ నుండి నిష్క్రమించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్థాన్ తదుపరి రౌండ్‌కు అర్హతకు శ్రమించాల్సి ఉంటుంది. మిగతా మ్యాచులు గెలిస్తే పాక్ సూపర్ 8 అర్హత సాధిస్తుంది.
పాకిస్థాన్ టోర్నీ నుండి నిష్క్రమిస్తుందా?
గ్రూప్-ఎ నుండి ఇప్పటివరకూ ఇండియా మాత్రమే సూపర్-8కు అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో USA రెండో స్థానంలో ఉంది. అమెరికా తమ 4 మ్యాచ్‌లను ఆడేసింది. పాకిస్థాన్ కూడా 4 పాయింట్లతో ఉంది. కానీ నెట్ రన్ రేట్ ఆధారంగా పాక్ టీమ్ అమెరికా కంటే వెనుకబడి ఉంది. బుధవారం పాకిస్థాన్, నమీబియా మ్యాచ్ ఉంది. ఒకవేళ పాకిస్థాన్ ఓడిపోతే 2024 తరహాలోనే అమెరికా సూపర్-8కి చేరుకుంటుంది.
గ్రూప్-బి నుండి శ్రీలంక అర్హత
ఈ గ్రూప్ నుండి ఆతిథ్య దేశం శ్రీలంక సూపర్-8లో తమ స్థానాన్ని ఫిక్స్ చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో లంక జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. మరోవైపు ఆస్ట్రేలియా సైతం టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం పెరిగింది. ఈరోజు (ఫిబ్రవరి 17) మధ్యాహ్నం 3 గంటలకు జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ ఉంది. ఒకవేళ జింబాబ్వే గెలిస్తే వారికి 6 పాయింట్లు వస్తాయి. కానీ ఆస్ట్రేలియా గరిష్టంగా 4 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది.
గ్రూప్-సి నుండి రెండు జట్లు ఖరారు
వెస్టిండీస్, ఇంగ్లాండ్ సూపర్-8లో తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచిన వెస్టిండీస్ 6 పాయింట్లతో గ్రూప్ సి నుంచి అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 4 మ్యాచ్‌లను ఆడగ ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ నుండి ఇక ఏ ఇతర జట్టు 6 పాయింట్లకు చేరుకునే ఛాన్సే లేదు.
గ్రూప్-డి పరిస్థితి ఏంటి ?
ఈ గ్రూప్ నుండి దక్షిణాఫ్రికా సూపర్-8కు చేరగా, రెండో స్థానం కోసం న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ నెలకొంది. న్యూజిలాండ్ 3 మ్యాచ్‌లలో 2 గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్‌లలో 1 మాత్రమే గెలిచి 2 పాయింట్లతో ఉంది. కానీ వారు తమ చివరి మ్యాచ్ గెలిచి 4 పాయింట్లకు రావొచ్చు. అయితే న్యూజిలాండ్ తన నాలుగో మ్యాచ్‌లో ఓడిపోతే అఫ్గాన్ కు అవకాశం లభిస్తుంది.
ఈరోజు సూపర్-8కు ఈ 2 జట్లు
ఈరోజు (ఫిబ్రవరి 17) కెనడాపై విజయం సాధిస్తే న్యూజిలాండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8కు చేరుకున్న ఆరో జట్టుగా నిలుస్తుంది. రెండో మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరుగుతుంది. ఇందులో గెలిచి జింబాబ్వే సూపర్-8కు చేరుకునే వీలుంది. ఈ పరిస్థితిలో ఆస్ట్రేలియా ఈసారి గ్రూప్ స్టేజ్ నుండే టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి అవుతుంది.
సూపర్-8కు చేరిన 5 జట్లు: భారత్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా.





















