IND vs PAK T20 World Cup 2026: అభిషేక్ శర్మ డకౌట్.. ప్లాన్ ప్రకారం రప్పించి ఔట్ చేసిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా
IND vs PAK Abhishek Sharma | పటిష్ట భారత జట్టుతో ఆడాలని అభిషేక్ శర్మ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా తన ప్లాన్ ప్రకారం అభిషేక్‌ను ఔట్ చేశాడు.

India vs Pakistan | కొలంబో: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలో జరుగుతున్న హై-వోల్టేజ్ భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా శనివారం చేసిన ట్రిక్ పనిచేసింది. ‘భారత బెస్ట్ టీమ్‌తో తలపడాలని ఉంది.. అభిషేక్ శర్మ ఆడాలని కోరుకుంటున్నాను’ అని చెప్పడం తెలిసిందే. అభిషేక్ అంటే ఎందుకు భయం, బెరుకు లేదని అంతా అనుకున్నారు. దానికి సమాధానం నేటి మ్యాచ్ తొలి ఓవర్లోనే దొరికింది.
పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా కోరుకున్నట్లుగానే అభిషేక్ శర్మ భారత్ తుది జట్టులోకి వచ్చారు. అయితే, సల్మాన్ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేశాడు. స్పిన్ కు అనుకూలించే ప్రేమదాస స్టేడియంలో పాక్ కెప్టెన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌ను తానే వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇషాన్ కిషన్ సింగిల్ తీయగా, తరువాత 3 బంతులకు అభిషేక్ స్కోర్ చేయలేకపోయాడు. దాంతో ఓపిక నశించి షాట్ కు ప్రయత్నించి 30 యార్డ్ సర్కిల్ లోనే దొరికిపోయాడు. సల్మాన్ ఆగా భారత ఓపెనర్ అభిషేక్ శర్మను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించి పరుగుల ప్రవాహానికి చెక్ పెట్టాడు. మిడ్ ఆన్ దిశగా గాల్లోకి లేచిన బంతిని షాహిన్ అఫ్రిద్ క్యాచ్ పట్టడంతో స్టేడియం సైలెంట్ అయిపోయింది. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ తీసి, తాను విసిరిన సవాల్‌ను సల్మాన్ ఆఘా నిలబెట్టుకున్నాడు.
Back-to-back ducks for #AbhishekSharma 😳
— Umang Deshmukh (@deshmukh_umang) February 15, 2026
Big stage.
Big expectations.
Pressure just hit another level. 🔥#INDvsPAK #IndiaVsPakistan #TeamIndia pic.twitter.com/9adv8M2GAD
భారత అభిమానుల్లో అసంతృప్తి..
అభిషేక్ శర్మ అవుట్ అయిన వెంటనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముఖంలో తీవ్ర అసంతృప్తి కనిపించింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అభిషేక్ ఆడతాడని ఎంతో నమ్మకంగా చెప్పిన సూర్య, కీలకమైన మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే వికెట్ పడటంతో ఒక్కసారిగా షాకయ్యాడు. అసలేం జరిగిందో అర్థంకాక డ్రెస్సింగ్ రూమ్ వైపు అభిషేక్ వెళ్లిపోయాడు. చివరి 6 టీ20లలో అభిషేక్ నాలుగోసారి డకౌట్ కావడంతో భారత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలిసినా, భారీ షాట్ కోసం ప్రయత్నించి అభిషేక్ వికెట్ పారేసుకోవడం ఎక్కడికి దారితీస్తుందో మరి. అమెరికాతో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ అభిషేక్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. తరువాత తెలుగుతేజం తిలక్ వర్మ బ్యాటింగ్‌కు వచ్చాడు. మరోవైపు ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడు.
వారికి అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం.. ఫ్యాన్స్ పోస్టులు వైరల్
కీలక టోర్నమెంట్లో అవకాశం రావడం ఆటగాళ్ల కల అని, కానీ వచ్చిన అవకాశాన్ని అభిషేక్ శర్మ దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. అందులోనూ పాక్ టీంపై కూడా డకౌట్ కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. సారీ ప్రిన్స్ శుభ్‌మన్ గిల్ అని కొందరు కామెంట్ చేస్తుండగా.. అభిషేక్ కంటే యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ బెస్ట్ అని వారిని తీసుకున్నా ఎంతో కొంత స్కోర్ చేసేవాళ్లు అని టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.





















