IND vs PAK Match Pitch Report: టెన్షన్ పెంచుతోన్న కొలంబో వెదర్, ప్రేమదాస స్టేడియం పిచ్ రిపోర్ట్.. బ్యాటర్లకు కష్టమే
India vs Pakistan T20 World Cup Match: T20 ప్రపంచ కప్‌లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. కొలంబో వాతావరణం, ప్రేమదాస స్టేడియం పిచ్ రిపోర్ట్ తెలుసుకోండి.

India vs Pakistan | టీ20 వరల్డ్ కప్ 2026లోని 27వ మ్యాచ్ టోర్నీలో మినీ ఫైనల్ లాంటిది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు నేటి రాత్రి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా తొలి 2 మ్యాచ్‌లు ముంబై, ఢిల్లీలలో ఆడి విజయం సాధించింది.
భారత్, పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..
కానీ ఇప్పుడు ప్రత్యర్థి పాక్ కావడంతో భారత్ వెలుపల మ్యాచ్ షెడ్యూల్ చేశారు. ఆదివారం కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు బ్రాడ్ కాస్టర్లు, స్పాన్సర్లు, క్రికెట్ బోర్డులు సైతం టెన్షన్ పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండటం, ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తుందని రిపోర్ట్ రావడంతో పిచ్‌పై ప్రభావంపై చర్చ జరుగుతోంది. కొలంబో వాతావరణం, ప్రేమదాస స్టేడియం పిచ్ రిపోర్ట్‌తో సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ 2026లోని 27వ మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. మొదటగా భారత్, పాక్ హెడ్-టు-హెడ్ రికార్డులు పరిశీలిస్తే మొత్తం 16 మ్యాచ్ లలో 13 నెగ్గి టీమిండియా పైచేయి సాధించింది.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ హెడ్-టు-హెడ్ (టీ20)
మొత్తం మ్యాచ్‌లు - 16
భారత్ గెలిచినవి - 13
పాకిస్థాన్ గెలిచినవి - 3
మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది?
ఫిబ్రవరి 15న టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 3 మ్యాచ్‌లు ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేడు చివరి మ్యాచ్. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ 6:30 గంటలకు వేస్తారు. నేడు నెగ్గే జట్టు సూపర్ 8కు చేరువ అవుతుంది.
కొలంబోలో వాతావరణం ఎలా ఉంటుంది?
వెదర్ రిపోర్ట్ ప్రకారం, కొలంబోలో ఆదివారం చాలా గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం పూట వర్షం పడే అవకాశం 20 నుండి 30 శాతం ఉండగా సాయంత్రం వర్షం పడే అవకాశం 40 శాతంగా ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం సైతం లేకపోలేదు. ఒకవేళ మ్యాచ్ జరిగినా, వాతావరణం పిచ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఆర్. ప్రేమదాస స్టేడియం పిచ్ రిపోర్ట్
ఆర్. ప్రేమదాస స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగ్గా ఉండటం క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇక్కడ మొదట ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభిస్తుంది. ఆట సాగే కొద్దీ పిచ్ నెమ్మదించి, స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడటం కష్టమవుతుంది. ఈ మ్యాచులో పాకిస్థాన్‌కు చెందిన ఉస్మాన్ తారిక్, భారత్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకం అవుతారు. కొలంబో వెదర్ బ్యాటర్లలో టెన్షన్‌ను పెంచింది. గాలి వేగంగా వీస్తే బంతి మరింత ఎక్కువ స్వింగ్ అవుతుంది. ఈ పిచ్‌పై సగటు స్కోరు 150-160 మధ్య నమోదు అవుతుందని అంచనా వేశారు.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలి?
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియోహాట్‌స్టార్ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.





















