Ind vs SA Highlights: సూపర్ 8లో టీమిండియాకు దారుణ పరాభవం.. 76 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం
అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచులో టీమిండియాపై దక్షిణాఫ్రికా పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అహ్మదాబాద్: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 తమ తొలి మ్యాచులో టీమిండియా దారుణంగా విఫలమైంది. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి సఫారీలు ప్రతీకారం తీర్చుకున్నారు. సూర్య సేనపై దక్షిణాఫ్రిక్రా ఏకంగా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శివం దుబే (42) పోరాడకపోతే స్కోరు కనీసం వంద కూడా దాటకపోయేది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మిల్లర్ (63), డెవాల్డ్ బ్రెవిస్ (45), ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్) రాణించారు. ఛేజింగ్‌కు దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈసారి ఇషాన్ కిషన్ వంతు..
ఆడిన 3 మ్యాచులతో అభిషేక్ శర్మ డకౌట్ కాగా, ఈసారి ఇషాన్ కిషన్ వంతు అయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మార్ క్రమ్ వేయగా నాలుగో బంతికి కీపర్ క్యాచిచ్చి ఇషాన్ ఔటయ్యాడు. ఆ వెంటన్ తిలక్ వర్మ (1)ను యాన్సెన్ ఔట్ చేసి మరో షాకిచ్చాడు. కుదురుకుంటున్న సమయంలో తెలివైన బంతితో యాన్సెన్ అభిషేక్ శర్మ (15)ను బోల్తా కొట్టించాడు. కార్బిన్ బాష్ పట్టిన సూపర్ క్యాచ్‌కు నిరాశగా పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ (18) కార్బిన్ బాష్ బౌలింగ్ లో బ్రేవిస్ క్యాచ్ అందుకోవడంతో ఔటయ్యాడు. మరో ఎండ్ లో శివం దుబే పోరాడుతున్న బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు.
కేశవ్ మహారాజ్ ట్రిపుల్ ధమాకా..
ఊహించినట్లుగానే స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రాణించాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. జట్టు స్కోరు 86 పరుగుల వద్ద 15వ ఓవర్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా (18) ఔట్ కాగా, 3వ బంతికి రింకూ సింగ్ డకౌట్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టేందుకు యత్నించిన అర్షదీప్ స్టబ్స్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండటంతో శివం దుబే (42) పోరాటం సరిపోలేదు. యాన్సెస్ బౌలింగ్ లో బుమ్రా ఆడిన బంతిని మార్ క్రమ్ క్యాచ్ అందుకోవడంతో సఫారీ జట్టు సంబరాలు మొదలయ్యాయి.
టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్..
టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే బుమ్రా, అర్షదీప్ సింగ్ రాణించడంతో ఒకానొక దశలో సఫారీలు కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. టాపార్డర్ త్వరగా పెవిలియన్ చేరిన తర్వాత, డెవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఆదుకున్నారు.
డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. బ్రెవిస్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 44 కీలక పరుగులు చేశాడు. ఈ ముగ్గురు మినహా జట్టులో మరే ఇతర బ్యాటర్ కనీసం 10 పరుగులు కూడా దాటలేకపోయారు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు.
ఘోరంగా మొదలైన ఇన్నింగ్స్
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం చాలా పేలవంగా సాగింది. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఉండగానే క్వింటన్ డికాక్ (06), ఐడెన్ మార్‌క్రమ్ (4), రియాన్ రికెల్టన్ (07) వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో జట్టు 150 పరుగులైనా చేస్తుందా అనిపించినా అద్భుతంగా కం బ్యాక్ చేసి భారీ స్కోరు చేసింది.
భారత బౌలింగ్
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రాణించి 3 వికెట్లు తీశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో వికెట్ తీసుకున్నారు. అయితే వరుణ్ 4 ఓవర్లలో 47 పరుగులు, దూబే 2 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూల్యం చెల్లించుకున్నారు. హార్దిక్ పాండ్యా (4 ఓవర్లలో 45 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (2 ఓవర్లలో 17 పరుగులు) వికెట్లు తీయలేకపోయారు.





















