Ben Stokes: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లిష్ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో వెంటవెంటనే వికెట్లు పడినప్పటికీ స్టోక్స్ చివరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు కప్ ను అందించాడు. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్ రెండేళ్ల కిందట డిప్రెషన్ తో బాధపడ్డాడట. ఈ విషయాన్ని స్టోక్సే స్వయంగా తన బయోపిక్ బెన్ స్టోక్స్ ఫీనిక్స్ ఫర్ ది యాషెస్ లో వెల్లడించారు.
రెండేళ్ల క్రితం 2020లో బెన్ స్టోక్స్ తండ్రి చనిపోయారు. అప్పుడు ఈ ఆల్ రౌండర్ డిప్రెషన్ తో బాధపడ్డాడు. ఈ క్రమంలో క్రికెట్ కు కొంతకాలం విరామం తీసుకున్నాడు. తండ్రి దూరమైన బాధ నుంచి తేరుకోవడానికి బ్రేక్ తప్పదనిపించింది. నేను గొప్ప క్రికెటర్ గా ఎదగడంలో మా నాన్న పాత్ర చాలా ఉంది. నా కోసం ఆయన చాలా చేశారు. అందుకే ఆయన మరణాన్ని జీర్ణించుకోవడానికి నాకు సమయం పట్టింది అని స్టోక్స్ చెప్పాడు.
విరామం అనంతరం జట్టులోకి వచ్చిన స్టోక్స్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ గా తన పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 49 బంతుల్లో 52 పరుగులు చేసి తన జట్టు ఛాంపియన్ గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇదే కాదు 2019 వన్డే ప్రపంచకప్ ఇంగ్లండ్ గెలవడంలోనూ స్టోక్స్ పాత్ర చాలా ఉంది. న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్ ను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. 98 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
టీ20 ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 విజేతగా ఇంగ్లాండ్ ఆవిర్భవించింది. మెల్‌బోర్న్ వేదికగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఫైనల్లో అద్వితీయ విజయం అందుకుంది. బంతితో మంచి పోటీనిచ్చిన పాకిస్థాన్‌ను ఓడించింది. బంతి బంతికీ పెరిగిన ఒత్తిడిని చిత్తు చేసింది. రెండోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ప్రత్యర్థి నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లిష్ జట్టు 5 వికెట్లు మిగిలుండగానే ఛేదించింది. 2019 వన్డే ప్రపంచకప్ మొనగాడు బెన్‌స్టోక్స్ (52; 49 బంతుల్లో 5x4, 1x6) అజేయంగా పోరాడి మరోసారి తన పేరు నిలబెట్టుకున్నాడు. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. కెప్టెన్ జోస్ బట్లర్ (26; 17 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. అంతకు ముందు పాక్‌లో బాబర్ ఆజామ్ (32; 28 బంతుల్లో 2x4), షాన్ మసూద్ (38; 28 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్లు.