Smriti Mandhana Marriage Marriage Date | భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా పెళ్లి వాయిదా పడింది. నేడు మరికొన్ని గంటల్లో వివాహం జరగనున్న తరుణంలో స్మృతి మంధానా తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో మంధానా, పలాష్ ముచ్చల్ ల వివాహం (Smriti Mandhana and Palash Muchhal Wedding) వాయిదా వేశారు. నవంబర్ 23న ముందు నిశ్చయించిన ముహూర్త ప్రకారం మంధాన పెళ్లి జరగలేదని, తండ్రికి గుండెపోటు రావడంతో వివాహ వేడుకను వాయిదా వేశారని మంధానా కుటుంబ సభ్యుల్లో ఒకరు ధృవీకరించారు.
అప్పటివరకూ సందడిగా రెండు కుటుంబాలు..
పెళ్లికి ముందు ఇతర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె, పలాష్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఇంతలో స్మృతి మంధానా తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్త బయటకు వచ్చింది. శుక్రవారం, శనివారాల్లో హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. నవంబర్ 23 మధ్యాహ్నం ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వాల్సి ఉంది. ఈ వివాహ వేడుక మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సి ఉంది. వివాహానికి కొన్ని గంటల ముందు మంధాన తండ్రికి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు.
తండ్రి కోలుకున్నాకే పెళ్లి చేసుకోనున్న స్మృతి మంధాన..
ఒక మీడియా నివేదిక ప్రకారం, స్మృతి మంధానా మేనేజర్ మాట్లాడుతూ.. మంధానా తన తండ్రి అంటే చాలా ప్రేమ. ఆయనకు చాలా దగ్గరగా ఉంటారని చెప్పారు. అందుకే తన తండ్రి అనారోగ్యం నుంచి కోలుకునే వరకు పెళ్లి చేసుకోకూడదని భారత క్రికెటర్ నిర్ణయించుకుందని తెలిపారు. మంధాన తండ్రి త్వరగా కోలుకుంటే త్వరలో ఓ మంచి ముహూర్తానికి వీరి వివాహం జరిపించనున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇండోర్‌కు చెందిన పలాష్ ముచ్చల్, స్మృతి మంధానకు కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో రెండు కుటుంబాలు అందుకు అంగీకరించాయి. ఆదివారం మధ్యాహ్నం వీరి వివాహం జరగాల్సిన ఉండగా.. కొన్ని గంటల ముందు మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతానికి మంధాన తన వివాహాన్ని వాయిదా వేసుకుంది.
వన్డే వరల్డ్ కప్ నెగ్గడంతో కీలకపాత్ర
దాదాపు 3 వారాల క్రితం, భారత మహిళల జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిందని తెలిసిందే. ఆ చారిత్రాత్మక విజయంలో స్మృతి మంధానా కీలక పాత్ర పోషించింది. మంధానా మొత్తం ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 434 రన్స్ చేసింది. వన్డే ప్రపంచ కప్‌లో ఆమె సగటు 54.25గా ఉంది. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 1000 పరుగులు చేయడానికి ఆమె కేవలం 7 పరుగులు దూరంలో నిలిచింది.