Shubman Gill ODI Record:  న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీ సాధించాడు. ఈ శతకంతో అతను ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 1000 పరుగులు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ల పేరిట ఈ రికార్డు ఉంది. వీరిద్దరూ 24 ఇన్నింగ్సుల్లో వెయ్యి పరుగులు సాధిస్తే గిల్ కేవలం 19 ఇన్నింగ్సుల్లోనే ఈ మైలురాయి అందుకున్నాడు. ప్రపంచంలోనే వేగంగా వెయ్యి పరుగులు చేసిన వారిలో పాకిస్థాన్ బ్యాటర్ ఫకార్ జమాన్ ముందున్నాడు. అతను 18 ఇన్నింగ్సుల్లో వెయ్యి పరుగులు చేశాడు. 


ఈ  మ్యాచ్ లో భారత్ ప్రస్తుతం 36 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు సాధించింది. గిల్ 120 పరుగులతో ఆడుతున్నాడు. రోహిత్ (34), సూర్యకుమార్ (31) పరుగులతో రాణించారు. ఇషాన్ కిషన్ (5), విరాట్ కోహ్లీ (8) విఫలమయ్యారు.  ప్రస్తుతం గిల్ కు తోడు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (14) క్రీజులో ఉన్నాడు. 


భారత్ బ్యాటింగ్


న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మరోసారి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. తన సహజ శైలికి విరుద్ధంగా నిదానంగా ఆడిన కెప్టెన్ రోహిత్ 38 బంతుల్లో 34 పరుగులు చేసి టిక్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ తన ఫాంను కొనసాగించలేకపోయాడు. 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ (14 బంతుల్లో 5) కూడా ఎక్కువసేపు నిలవలేదు. దీంతో భారత్ 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కాసేపు గిల్ కు సహకరించాడు. అయితే తనకు లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు సూర్య. 26 బంతుల్లో 31 పరుగులు చేసి నిష్క్రమించాడు.