Ranji Trophy history:  దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో అద్భుతం నమోదైంది. 80 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ఒక జట్టు ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న సర్వీసెస్‌(Services). హర్యానా(Haryana )ను ఒక్క పరుగు తేడాతో ఓడించి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సర్వీసెస్‌ నిర్దేశించిన 146 పరుగుల ఛేదనలో హర్యానా 144 పరుగుల వద్దే ఆలౌట్‌ అయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సర్వీసెస్‌, తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన హర్యానా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 103 పరుగులకే ఆలౌట్‌ అయింది. రెండో ఇన్నింగ్స్‌ ఆడిన సర్వీసెస్‌ 140 పరుగులకు ఆలౌట్‌ అయింది. 146 పరుగుల ఛేదనలో హర్యానా.. 144 పరుగుల వద్దే ఆగిపోయింది. సర్వీసెస్‌ బౌలర్లలో అర్జున్‌ శర్మ, పుల్కిత్‌ నారంగ్‌లు తలా ఐదు వికెట్లు తీసి హర్యానాను దెబ్బతీశారు. 

 

సెమీస్‌లోకి దూసుకెళ్లిన హైదరాబాద్‌

రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో అదిరే ప్రదర్శనతో హైదరాబాద్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన గ్రూప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 73 పరుగుల ఆధిక్యంతో మిజోరంను చిత్తుచేసి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన హైదరాబాద్‌ 35 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానం నిలిచి సత్తా చాటింది. హైదరాబాద్‌ తర్వాత మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌  వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి.

 

మ్యాచ్‌ సాగిందిలా...

మిజోరాంతో జరిగిన పోరులో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. మిజోరాం తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులు చేయగా.. హైదరాబాద్‌ 465/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మిజోరాం 193 పరుగులకు ఆలౌటైంది. మన బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. బంతితో 6 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్‌తో 60 పరుగులు చేసిన ఆల్‌రౌండర్‌ రోహిత్‌ రాయుడుకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. గ్రూప్‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన హైదరాబాద్‌ 35 పాయింట్లతో పట్టిక టాప్‌లో నిలిచింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ మనవాళ్లు ఇన్నింగ్స్‌ తేడాతో విజయాలు సాధించింది.

 

ఊచకోత అంటే ఇదేనేమో...

దేశవాళి ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌(Team Hyderabad) జట్టు మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న హైదరాబాద్‌ జట్టు.. అయిదో మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. అరుణాచల్‌ ప్రదేశ్‌తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ చరిత్ర సృష్టించాడు. కేవలం 147 బంతుల్లో త్రి శతకం సాధించి దేశవాళీ క్రికెట్‌లో రికార్డు సృష్టించాడు. 147 బంతుల్లోనే 300 పరుగులు సాధించిన తన్మయ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీని నమోదు చేశాడు. 2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్‌ 191 బంతుల్లో 300 పరుగులు చేయగా... ఈ రికార్డును తన్మయ్‌ బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్‌కు చెందిన కెన్ రూథర్‌ఫర్డ్‌ 234 బంతుల్లో... వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ 244 బంతుల్లో.. శ్రీలంకకు చెందిన కుశాల్‌ పెరిరా 244 బంతుల్లో త్రిశతకాలు సాధించారు. వీరందినీ అధిగమించిన తన్మయ్‌ కేవలం 147 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. 160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సర్లతో 323 పరుగులు చేశాడు.