Sreesanth Comments On Gautam Gambhir: టీమిండియా (Team India) మాజీ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), మాజీ పేసర్ శ్రీశాంత్ (S Sreesanth) మధ్య చోటు చేసుకున్న గొడవ హట్ టాపిక్‌గా మారింది. మైదానంలో వాదులాడుకున్న ఈ సీనియర్ ఆటగాళ్లు.. ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) వేదికగా మాటల యుద్ధానికి తెరలేపారు. ఈ గొడవను ఉద్దేశించిన గంభీర్ క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేయగా.. శ్రీశాంత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'ప్రపంచం మొత్తం మీ మీద దృష్టి పెట్టిన సందర్భంలో ఒక స్మైల్ ఇవ్వండి' అంటూ తాను నవ్వుతున్న ఫొటో‌ను గంభీర్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌పై శ్రీశాంత్ ఘాటుగా స్పందించాడు. సహచర ఆటగాళ్లకు గౌరవం కూడా ఇవ్వని వ్యక్తి నవ్వు గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు.


'మీరు ఓ క్రీడాకారుడు హద్దులు దాటి ప్రవర్తించారు. పైగా మీరొక ప్రజా ప్రతినిథి. ప్రతి క్రికెటర్‌తో గొడవపడుతూనే ఉన్నారు. అసలు నీతో నాకున్న సమస్య ఏంది? నేను నవ్వుతూనే మీ వైపు చూశాను. కానీ మీరు ఫిక్సర్ నన్ను సంబోధించారు. నిజంగా నేను ఫిక్సర్‌నా? సుప్రీం కోర్టు కంటే మీరు ఎక్కువనా..? ఇలా మాట్లాడేందుకు నీకు ఎలాంటి అధికారాలు లేవు. చివరకు నువ్వు అంపైర్లను కూడా అసభ్య పదజాలంతో దూషించావు. అలాంటి నువ్వు నవ్వు గురించి మాట్లాడుతున్నావా? నువ్వో అహంకారివి. నీకు మద్దతు ఇచ్చే వారి పట్ల కూడా మర్యాదగా నడుచుకోవు. 


నిన్నటి వరకు నీవు.. నీ కుటుంబ అంటే నాకు చాలా గౌరవం ఉండేది. కానీ నువ్వు ఫిక్సర్ అని అవమానకరమైన పదాన్ని వాడి గౌరవాన్ని పోగొట్టుకున్నావు. ఒకసారే కాకుండా ఫిక్సర్ అని 7-8 సార్లు అన్నావు. ఫ*అనే బూతు పదాన్ని కూడా వాడావు. నీ మాటలతో నన్ను రెచ్చగొట్టావు. నా ప్లేస్‌లో మరే వ్యక్తి ఉన్నా.. నిన్ను క్షమించరు. నువ్వు చేసిన తప్పిదం ఏంటో నీ మనస్సాక్షికి తెలుసు. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. ఆ ఘటన తర్వాత నువ్వు మళ్లీ మైదానంలోకి కూడా రాలేదు. ఆ దేవుడు అన్నీ చూస్తున్నాడు.'అని శ్రీశాంత్.. గంభీర్ పోస్ట్‌కు సుదీర్ఘ కామెంట్ పెట్టాడు.


అసలు వివాదం ఏంటి?
లెజెండ్స్ లీగ్ 2023లో భాగంగా ఇండియా క్యాపిట‌ల్స్‌కు గౌత‌మ్ గంభీర్, గుజ‌రాత్ జెయింట్స్ త‌రుపున‌ శ్రీశాంత్‌ ఆడుతున్నారు. ఈ నెల ఆరో తేదీ బుధవారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీశాంత్ వేసిన ఓ ఓవ‌ర్‌లో గంభీర్ వ‌రుస‌గా సిక్స్‌, ఫోర్ బాదాడు. దీంతో గంభీర్ వైపు శ్రీశాంత్ సీరియ‌స్‌గా చూడ‌డంతో గంభీర్ సైతం కోపంగా అత‌డి వైపు చూశారు. దీంతో ఇద్దరి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ప‌లువురు ఆట‌గాళ్లతో పాటు అంపైర్లు వ‌చ్చి వారిద్దరికి స‌ర్దిజెప్పారు. మ్యాచ్ స‌జావుగా సాగేలా చూశారు.


స్పందించిన శ్రీశాంత్
గంభీర్‌తో వివాదంపై మ్యాచ్ అనంత‌రం సోష‌ల్ మీడియా వేదిక‌గా శ్రీశాంత్‌ స్పందించాడు. ‘మిస్టర్ ఫైటర్’ గంభీర్‌తో జరిగిన విషయంలో తన త‌ప్పేమీ లేదని, ఆయ‌న కార‌ణం లేకుండానే గొడ‌వ‌లు ప‌డుతుంటాడని అన్నాడు. తానే ఏమీ అన‌క పోయినా అస‌భ్యకర‌మైన మాట‌లు అన్నాడని, ఏం అన్నాడో అనేది త్వర‌లోనే అంద‌రికి చెబుతానని చెప్పాడు. గంభీర్ అలా మాట్లాడడం తప్పని, ఇప్పటికే తాను ఎన్నో క‌ష్టాలు ప‌డ్డానని, అభిమానుల సపోర్ట్‌తో పోరాడుతున్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల పాటు సీనియ‌ర్ ప్లేయ‌ర్లకు గంభీర్ మ‌ర్యాద ఇవ్వడ‌ని, ఎప్పుడైన‌ కామెంట్రీ స‌మ‌యంలో విరాట్ కోహ్లీ గురించి అడిగితే దాని గురించి మాట్లాడ‌డ‌ని ఆరోపించాడు.