Rohit Sharma Game Plan:  గయానా(Gayana)లోని ప్రొవిడెన్స్‌లో ఇవాళ జరిగే టీ 20 ప్రపంచకప్(T20 World Cup) రెండో సెమీ-ఫైనల్‌(Semi Final)లో ఇంగ్లండ్‌(England)తో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్‌తో కీలకమైన సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ముందు రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఒత్తిడి ఉంటుందని... దాని గురించి పదేపదే మాట్లాడడం తనకు ఇష్టం లేదని హిట్‌మ్యాన్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు జట్టులు వాతావరణాన్ని సాధారణంగా ఉండేలా చూడడం... జట్టు సభ్యులను ప్రశాంతంగా ఉండడం ముఖ్యమని రోహిత్ అన్నాడు. ఈ మ్యాచ్‌ విషయంలో తాము స్పష్టమైన ఆలోచనలతో ఉన్నామని కూడా హిట్‌మ్యాన్‌ తెలిపాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో ఇది మరొక మ్యాచ్‌గానే తాము భావిస్తున్నామని రోహిత్ వివరించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలన్న పట్టుదలతో ఉన్నామని కూడా వెల్లడించాడు. మ్యాచ్‌ గురించి మరీ ఎక్కువ ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుందని.. ఇది సెమీఫైనల్‌ మ్యాచ్‌ అని అందరికీ తెలుసని.... కానీ దాని గురించే మళ్లీ మళ్లీ మాట్లడడం మంచిదికాదని రోహిత్ తెలిపాడు. జట్టంతా ఒక మంచి మానసిక స్థితిలో ఉందన్న రోహిత్‌.. ఒక జట్టుగా తాము బాగా ఆడుతున్నామని... ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నామని అన్నాడు. జట్టులో ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తున్నారని, ఈ టోర్నమెంట్‌లో కొన్నిసార్లు తాము ఒత్తిడికి గురయ్యామని అయినా దానినుంచి బయటపడ్డామని హిట్‌మాన్‌ గుర్తు చేశాడు. 



జట్టుగా ఏం చేయాలో తెలుసు
 తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎంత బాగా ఆడగలమో అంత బాగా ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని రోహిత్‌ తెలిపాడు. జట్టుగా మేం ఏం చేయగలమో మాత్రమే ఆలోచిస్తున్నామని.. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచిస్తే మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరని రోహిత్ తెలిపాడు. ఫీల్డ్‌లో ఏం చేయాలో తమకు బాగా తెలుసని... జట్టులోని ప్రతీ ఆటగాడికి వారి బాధ్యత స్పష్టంగా తెలుసని టీమిండియా సారధి తెలిపాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ రెండో టీ 20 ప్రపంచకప్‌లో మొదటిసారిగా ప్రొవిడెన్స్‌లో ఆడనున్నాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులపై ఇరు జట్లకు సమానమైన అవగాహన ఉందని రోహిత్ చెప్పాడు. ఈ పిచ్‌పై ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని అర్థం చేసుకుని బ్యాటింగ్‌ చేయాల్సి ఉందన్నాడు. 



పిచ్‌ను బట్టే...
 ఇప్పుడు జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాడని.. కాబట్టి అందరిపై తమకు పూర్తి నమ్మకం ఉందని రోహిత్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లోనూ దూకుడు విధానాన్ని అవలంభిస్తారా అన్న ప్రశ్నకు రోహిత్‌ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఈ ప్రశ్నకు బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్‌ను రోహిత్‌ సమాధానంగా చెప్పాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసిందని.. హార్దిక్ పాండ్యా  ఒక్కడే 40 కంటే ఎక్కువ పరుగులు చేశాడని గుర్తు చేశాడు. జట్టులో ఎవరూ 50 పరుగులు చేయకపోయినా భారీ స్కోరు చేశామని... రోహిత్‌ అన్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భయం లేకుండా ఆడతామని రోహిత్ చెప్పాడు. గత కొన్నేళ్లుగా తాము భయం లేని క్రికెట్‌ ఆడుతున్నామని... ఇప్పుడు అదే చేస్తామని వెల్లడించాడు.