పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ భారీ ఇన్నింగ్స్‌ ఆడని మ్యాక్స్‌వెల్‌ సునామీలా డచ్‌ జట్టుపై విరుచుకుపడ్డాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదేసి విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచకప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీని సాధించేశాడు. మ్యాక్స్‌వెల్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 44 బంతులో ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్‌ 9 ఫోర్లు, 8 సిక్సులతో 106 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌తో గ్లెన్‌ ఈ ఒక్క రికార్డే కాదు మరికొన్ని రికార్డులను నెలకొల్పాడు అవేంటంటే... 

 

రికార్డులివే...

 

1‌) ప్రపంచకప్‌ చరిత్రలోనే  మ్యాక్స్‌వెల్‌ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. కేవలం 40 బంతుల్లోనే ఈ మైలురాయి చేరుకున్నాడు, దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్‌రామ్ 43 బంతుల్లో చేసిన రికార్డును మ్యాక్స్‌వెల్‌ బద్దలు కొట్టాడు. 40 బంతుల్లోనే చేసిన సెంచరీ వన్డే చరిత్రలో ఆస్ట్రేలియన్  క్రికెటర్‌ చేసిన వేగవంతమైన శతకం కూడా. 

 

2)  వన్డేల్లో చివరి పది ఓవర్లలో 100కి పైగా పరుగులు చేసిన తొలి ఆసీస్ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్. 

 

3‌) మాక్స్‌వెల్ తన ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ , రికీ పాంటింగ్‌లతో కలిసి పాటు ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో మ్యాక్స్‌వెల్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

 

4‌) మాక్స్‌వెల్ -పాట్ కమ్మిన్స్ ఏడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఇది ప్రపంచ కప్ లో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం. 

 

ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సునామీ ఇన్నింగ్స్‌.. డేవిడ్‌ వార్నర్‌ మరోసారి శతక గర్జన చేసిన సమయాన... పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. డచ్‌ జట్టుపై నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేశారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రపంచకప్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి నెదర్లాండ్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, ఎనిమిది సిక్సులతో మ్యాక్స్‌ వెల్‌ 106 పరుగులు చేశాడు. మ్యాక్స్‌ వెల్‌ విధ్వంసకర శతకానికి తోడు పాకిస్థాన్‌పై భారీ సెంచరీతో చెలరేగిన డేవిడ్‌ బాయ్‌... ఈ మ్యాచ్‌లోనూ శతక నాదం చేశాడు. డేవిడ్‌ వార్నర్‌ 93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు. వార్నర్‌కు తోడుగా స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ కూడా రాణించడంతో కంగారు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ 68 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సుతో స్మిత్‌ 71 పరుగులు చేశాడు.

 

లబుషేన్‌ తన సహజ స్వభావానికి విరుద్ధంగా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో లబుషేన్‌ 62 పరుగులు చేశాడు. అనంతరం 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు వణికించారు. 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన డచ్‌ జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆడమ్‌ జంపా మరోసారి నాలుగు వికెట్లతో నెదర్సాండ్స్‌ పతనాన్ని శాసించాడు. నెదర్లాండ్స్‌ బ్యాటర్లు ఆరుగురు... కనీసం రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. డచ్‌ బ్యాటర్లలో అత్యధిక స్కోరు 25 పరుగులే కావడం గమనార్హం. విక్రమ్‌జిత్‌ సింగ్‌ తప్ప మరే బ్యాట్స్‌మెన్‌ కనీసం 15 పరుగుల మార్కును దాటలేకపోయాడు. దీంతో కేవలం 21 ఓవర్లలో 90 పరుగులకే నెదర్లాండ్స్‌ పని అయిపోయింది,.