దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో త్రుటిలో ఓడిపోయిన  పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గెలుపు ముంగిట పాక్‌ బోర్లాపడింది. చివరి వరకూ పోరాడినా పాక్‌కు విజయం దక్కలేదు. అసలు ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే... 

 

ఓపెనింగ్ భాగస్వామ్యం  వైఫల్యం:

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు శుభారంభం అవసరం. కానీ పాక్‌ ఓపెనింగ్ జోడీ మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయింది. మెరుగైన ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదైతే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ దాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో పాక్‌ ఓపెనింగ్‌ జోడి వైఫల్యం చెందింది. ఈ ప్రపంచకప్‌లో అసలు పాకిస్థాన్‌కు సరైన ఆరంభమే దక్కలేదు. అబ్దుల్లా షఫీక్ కొన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడినా ఇమామ్‌ మాత్రం ప్రతి మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాపై కూడా ఈ వైఫల్యం కొనసాగింది. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో పాక్ ఓపెనర్లు 9, 12 పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. దీంతో పాక్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. 

 

భారీస్కోర్లు సాధించడంలో విఫలం:

దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో మంచి ఆరంభం దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో పాక్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. పిచ్‌పై ఎక్కువ సమయం గడిపినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేదు. పాకిస్థాన్ మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. బాబర్ ఆజం, రిజ్వాన్, ఇఫ్తికర్, సౌద్, షాదాబ్, నవాజ్ కుదురకుంటున్న సమయంలో అవుటయ్యారు. ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ అయిదారుగు బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు కడదాక నిలిచి ఉన్నా పాకిస్తాన్ ఆలౌట్ అయ్యేది కాదు. జట్టు స్కోరు 300 పరుగులు దాటేది.

 

ఆరంభ ఓవర్లలో పరుగుల వరద:

పవర్‌ ప్లేలో పాక్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పాక్ బౌలర్లు ప్రొటీస్‌ బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ఇఫ్తికార్‌, షాహీన్‌ షా అఫ్రిది తొలి ఓవర్లలో ధారళంగా పరుగులు ఇచ్చారు. దీంతో సఫారీ బ్యాటర్లపై ఒత్తిడి పూర్తిగా తొలగిపోయింది.

 

స్పిన్ విభాగం విఫలం: 

చెపాక్ పిచ్ స్పిన్ బౌలర్లకు మంచి మద్దతునిస్తుంది, అయితే దానిని సద్వినియోగం చేసుకునేందుకు పాకిస్థాన్‌కు స్పెషలిస్ట్ స్పిన్నర్లు లేరు. ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఇదే అతిపెద్ద బలహీనత. ఉసామా మీర్ ప్రభావం చూపలేకపోయాడు. షాబాద్, నవాజ్, ఇఫ్తికార్ పార్ట్‌టైమ్‌  స్పిన్నర్లుగా మిగిలిపోయారు. దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ స్పిన్నర్లు కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగా, ప్రొటీస్ స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ నలుగురు పాకిస్థానీ బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. 

 

రనౌట్ అవకాశాలు మిస్: 

ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో పాకిస్థాన్ పెద్దగా పొరపాట్లు చేయనప్పటికీ... కీలకమైన అవకాశాలను చేజార్చుకున్నారు. మ్యాచ్‌ను మలుపు తిప్పే రెండు అవకాశాలు పాక్ చేజారాయి. ఈ మ్యాచ్‌లో మార్క్రమ్‌ రెండుసార్లు రనౌట్ నుంచి తప్పించుకుని కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పాక్‌ ఫీల్డర్లు డైరెక్ట్ హిట్ చేసుంటే మార్క్రమ్ పెవిలియన్ చేరేవాడు. మార్ర్క్‌మ్‌ త్వరగా పెవిలియన్‌కు చేరి ఉంటే, పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి అవకాశం ఉండేదని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

 

అంపైర్ నిర్ణయం: ఎన్నో తప్పిదాలు చేసినా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు విజయానికి చేరువైంది. హారీస్‌ రౌఫ్‌ వేసిన 46వ ఓవర్ చివరి బంతికి షమ్సీ ప్యాడ్లను బలంగా తాకింది. అప్పటికే దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయింది. విజయానికి 8 పరుగులు చేయాల్సి ఉంది. ఇక్కడ అంపైర్ నాటౌట్‌ ఇచ్చాడు. బాబర్ అజామ్ రివ్యూ తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఒకవేళ అంపైర్ ఔట్ ఇచ్చి ఉంటే పాకిస్థాన్‌కు చిరస్మరణీయ విజయం లభించేంది.