Rashid Khan Quits From T20 League: అఫ్గ‌నిస్థాన్ బౌలింగ్‌లో స్టార్‌ స్పిన్నర్‌, టీ20 కెప్టెన్ ర‌షీద్ ఖాన్‌(Rashid Khan)కు వెన్నెముక‌ స‌ర్జరీపూర్తయ్యింది. గురువారం ఈ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఈ విష‌యాన్ని తన అభిమానుల‌తో పంచుకున్నాడు. ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. సర్జరీ సక్సెస్ అయ్యిందని, మ‌ళ్లీ మైదానంలోకి దిగేందుకు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. అభిమానుల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపాడు. అత‌డి పోస్ట్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans ) వెంట‌నే స్పందించింది. కింగ్ ఖాన్ నువ్వు తొంద‌ర‌గా కోలుకుంటావు అని కామెంట్ పెట్టింది.


క్రికెట్ అభిమానులకు బాగా దగ్గరైన విదేశీ క్రికెటర్లలో రషీద్ ఖాన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తెలుగు టీం గా ఐపీఎల్ లో ప్రస్థానం కొనసాగిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా కొంతకాలం కొనసాగాడు రషీద్ ఖాన్. తన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు అతను గుజరాత్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అయితే ఏ టీం కి మారినా తన ఆటతో మాత్రం క్రికెట్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.


మన దేశంలో ఇటీవ‌లే ముగిసిన‌ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ర‌షీద్ అద్భుతంగా రాణించాడు. అఫ్గ‌న్ సాధించిన విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. అయితే.. గాయం కార‌ణంగా ఆస్ట్రేలియాతో ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ర‌షీద్ ఆడ‌లేదు. ఈ నేపధ్యంలోనే మెగా టోర్నీ త‌ర్వాత స‌ర్జ‌రీ చేయించుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు. దీంతో ఆసీస్‌లో జ‌రుగుతున్న‌ బిగ్‌బాష్‌లీగ్ 13వ సీజ‌న్‌కు దూర‌మ‌య్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 2024 జనవరిలో భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ ఆడడం కూడా రషీద్‌కు కష్టమేనని తెలుస్తోంది.


ప్రపంచకప్‌లో  అఫ్ఘానిస్థాన్ పోరాటం అద్భుతంగా ముగిసింది. ఎటుచూసినా అంధకారమే ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్‌.. అద్భుత ప్రదర్శన చేసింది అబ్బురపరిచింది. మూడు ప్రపంచ ఛాంపియన్‌ జట్లను చిత్తు చేసి మరో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించినంత పని చేసింది. అఫ్గాన్‌తో మ్యాచ్‌ అంటే అగ్ర జట్ల కూడా భయపడేలా... సమగ్ర వ్యూహంతో బరిలోకి దిగేలా చేసింది. ఈ వరల్డ్ కప్‌లో సెమీస్‌ చేరేందుకు మిగిలిన నాలుగో బెర్తు కోసం చివరి క్షణం వరకు అఫ్గాన్‌ రేసులో నిలిచిందంటే  అర్ధం చేసుకోవచ్చు. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఆ జట్టు పోరాటం ఆకట్టుకుంది. ఒకప్పుడు బౌలింగ్‌లో సత్తా చాటి బ్యాటింగ్‌లో చేతులెత్తేసి ఓటమి పాలవ్వడం అప్గాన్‌కు సాంప్రదాయంగా ఉండేది. కానీ ఈ వరల్డ్‌కప్‌లో అప్గాన్ బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. ప్రపంచకప్‌ చరిత్రలోనే ఓ అఫ్గాన్‌ బ్యాటర్‌ సెంచరీ చేసి సత్తా చాటాడు. అంతేనా ఈ పోరాటాలతో అఫ్గాన్‌ ఇక పసికూన జట్టు కాదని.. అగ్ర జట్టని మాజీ క్రికెటర్లు తీర్మానం చేసేశారు. 


ఒక్క ఆటగాడిపైనే ఆధారపడకుండా.. సమష్టి ఆటతీరుతో అఫ్ఘానిస్థాన్‌ విజయాలు సాధించింది. పెద్ద జట్లను చూసి భయపడి వెనక్కి తగ్గడం కాదు.. సవాలు విసిరే పోరాటంతో గెలవడం అలవాటుగా మార్చుకుంది అఫ్ఘానిస్థాన్. ఏకంగా మూడు పెద్ద జట్లపై అఫ్గాన్‌ విజయాలే అందుకు నిదర్శనం. ఈ విజయాలు కూడా ఏదో గాలివాటం కాదు. పూర్తి ఆధిపత్యంతో, సాధికారికంగా సాధించినవే.