ICC Champions Trophy News: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తమ దేశంలో ఆడకుండా దుబాయ్ లో ఆడుతున్న ఇండియన్ క్రికెట్ టీమ్ పై పాకిస్థాన్ లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1996 తర్వాత పాక్ నిర్వహిస్తున్న ఐసీసీ టోర్నీ ఇదే కావడం విశేషం. అయితే ఈ టోర్నీలో టాప్ -8 టీమ్స్ పాల్గొంటుండగా, భారత్ తప్ప మిగతా అన్ని జట్లు పాక్ లో మ్యాచ్ లు ఆడుతున్నాయి. ఐసీసీ చొరవతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీలో ఆడేందుకు భారత్ ఒప్పుకుంది. దీని ప్రకారం లీగ్ మ్యాచ్ లతోపాటు నాకౌట్ మ్యాచ్ లు (ఒకవేళ చేరితే) దుబాయ్ లోనే భారత్ ఆడనుంది. తమ దేశంలో భారత్-పాక్ మ్యాచ్ ను చూద్దామని ఆశించిన పాక్ అభిమానులకు తాజా పరిణామం మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా పలు డిమాండ్లు లేవనెత్తుతున్నారు. టోర్నీ ముగిసేవరకు భారత్ తో దూరంగా ఉండాలని, ఆటగాళ్లతో సఖ్యతగా మెలగవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అండ్ కో తో ముచ్చట్లు, హగ్గులు పెట్టుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మీడియాతో ఓ పాక్ ఫ్యాన్ మాట్లాడిన వీడియో వైరలైంది. ఈనెల 19న న్యూజిలాండ్-పాక్ జట్ల మధ్య పోరుతో మెగాటోర్నీ అధికారికంగా ప్రారంభమవుతుంది. 23న చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు జరుగుతుంది.
ఫ్రెండ్లీగా ఉండొద్దని మాజీల సూచన..
భారత క్రికెటర్లతో ఫ్రెండ్లీగా ఉండవద్దని తమ క్రికెటర్లకు పాకిస్థాన్ దేశ మాజీ ప్లేయర్ చెబుతున్నాడు. ప్లేయర్ల పట్ల గౌరవం ఉంటే మంచిదే అని, అది ఫీల్డులో చూపించాల్సిన అవసరం లేదని పాక్ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ అభిప్రాయ పడ్డాడు. భారత్ తో మ్యాచ్ లో ఎలా వ్యవహరించాలో మొయిన్ ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. మైదానంలో భారత ఆటగాళ్లతో అంత కలివిడిగా ఉండాల్సిన అవసరం లేదని, అలా ఉంటే అది బలహీనతగా ప్రొజెక్టు అవుతుందని పేర్కొన్నాడు. భారత జట్టుతో తాము ఎన్నో మ్యాచ్ లను ఆడామని, ద్వైపాక్షిక సిరీస్ లు కూడా ఆడిన మైదానంలో ఫ్రెండ్లీగా ఎప్పుడు లేమని మొయిన్ ఖాన్ గుర్తు చేశాడు. తమ జనరేషన్లో చాలా దిగ్గజాలు భారత జట్టులో ఉండేవారని, వారితో ఆడినప్పుడు కేవలం ప్రత్యర్థులుగానే ట్రీట్ చేసేవాళ్లమని తెలిపాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్ ల్లో ఫ్రెండ్లీనెస్ ఓవర్ అయిందని విమర్శించాడు. భారత ఆటగాళ్లు క్రీజులోకి రాగానే, వాళ్ల బ్యాట్లను తడిమి చూడటం, స్నేహపూర్వకంగా ఉండటం సరికాదని వ్యాఖ్యానించాడు. ఇలాంటి చేష్టలను వీక్ నెస్ గా ప్రత్యర్థి టీమ్ లు భావించే అవకాశముందని, అంతిమంగా జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపించే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.
నో వార్మప్ మ్యాచ్..శనివారం భారత్ దుబాయ్ కు బయలుదేరుతుంది. మెగాటోర్నీకి ముందు ప్రతీ జట్టు వార్మప్ మ్యాచ్ లు ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. కానీ టీమిండియా మాత్రం ఈ సారి వార్మప్ మ్యాచ్ లు ఆడడం లేదు. మొదటి మ్యాచ్ కు ముందు పూర్తిస్థాయి సమయం లేకపోవడమే దీనికి కారణం. మిగిలిన జట్లన్నీ పాకిస్తాన్ లో ఉండడం కారణంగా చెబుతున్నారు. ఎందుకంటే భారత్ మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ లో జరుగుతుండగా.. మిగిలిన అన్ని మ్యాచ్ లో పాక్ గడ్డపైనే నిర్వహిస్తున్నారు. దీంతో మిగిలిన జట్లు వార్మప్ కోసం దుబాయ్ వచ్చి మళ్ళీ పాక్ వెళ్ళే క్రమంలో అలసిపోతారని భావిస్తున్నాయి. దీంతో పాటు బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు భారత జట్టు పూర్తిగా ప్రాక్టీస్ కే పరిమితం కావాలని నిర్ణయించుకుంది. అక్కడి పిచ్ లు ఇంచుమించు భారత్ తరహాలోనే ఉండడంతో వార్మప్ మ్యాచ్ లేకున్నా పెద్దగా ఇబ్బంది లేదన్నది టీమిండియా మేనేజ్ మెంట్ అభిప్రాయం. ఏదేమైనా ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఫుల్లు జోష్ లో ఉన్న భారత్.. మూడోసారి చాంపియన్స్ టోర్నీని నెగ్గాలని భావిస్తోంది.
Read Also: Dhoni VS WPL: ధోనీని గుర్తుకు తెస్తున్న ఆర్సీబీ స్టార్.. తాజా ఇన్నింగ్స్ తో నెటిజన్లు ఫిదా