మహ్మద్‌ షమీ.. పోరాట యోధుడు. ప్రపంచకప్‌లాంటి  మెగా టోర్నీలో తొలి నాలుగు మ్యాచుల్లో అసలు షమీకి జట్టులో చోటే దక్కలేదు. అలాగని షమీ నిరాశలో కూరుకుపోలేదు. అవకాశం కోసం వేచి చూశాడు. ఒక్కసారి అవకాశం రాగానే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ప్రపంచకప్‌లో వేసిన తొలి బంతికే వికెట్‌ తీసి తానంటే ఏంటో నిరూపించుకున్నాడు. ఇలాంటి ఆటగాడిన ఇన్ని మ్యాచులు దూరం పెట్టిందని క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయేలా చేశాడు. ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బరిలోకి దిగిన ఈ సీనియర్‌ సీమర్‌... అయిదు వికెట్లతో సత్తా చాటాడు. సులువుగా 300 దాటేలా కనిపించిన కివీస్‌.. 273కు పరిమితమైందంటే అది కచ్చితంగా షమి ఘనతే. చివరి రెండు స్పెల్స్‌లో మరింత గొప్పగా బౌలింగ్‌ చేశాడు షమి. పేస్‌కు అనుకూలిస్తున్న ధర్మశాల పిచ్‌ను అతను మ్యాచ్‌లో మిగతా బౌలర్లందరికంటే బాగా ఉపయోగించుకున్నాడు. ఓవైపు వేగంతో భయపెడుతూనే.. మరోవైపు వికెట్‌కు రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేస్తూ కివీస్‌ ప్రధాన బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. 

 

పోరాట యోధుడు

ఇదే తొలిసారి కాదు షమీ తనను తాను నిరూపించడం. 2020 ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమవడంతో భారత వన్డే జట్టు నుంచి షమీని తప్పించారు. 19 నెలల తర్వాతకానీ అతడికి వన్డే జట్టుకు పిలుపు లభించలేదు. బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ గాయాల బారినపడడంతో సెలెక్టర్లు షమీకి అవకాశం ఇచ్చారు. అప్పుడు మళ్లీ తనను తాను నిరూపించుకుని ఈ ప్రపంచకప్‌లో స్థానం సంపాదించాడు. ఈక్రమంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో  అయిదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. కివీస్‌ ఓపెనర్‌ విల్‌ యాంగ్‌, భీకర ఫామ్‌లో ఉన్న రచిన్‌ రవీంద్ర, మిషెల్‌ శాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ, డారిల్‌ మిషెల్‌ను అవుట్‌ చేసి ఈ మెగాటోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే షమీ ఐదు వికెట్లు తన పేరిట రాసుకున్నాడు. 

 

దీంతో వరల్డ్‌ కప్‌లలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.  ఆదివారం ఇంగ్లాండ్‌పైనా అతను అదే స్థాయిలో రెచ్చిపోయాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై షమీ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో గత ప్రపంచకప్‌ హీరో బెన్‌ స్టోక్స్‌ను అవుట్‌ చేసిన బంతిని చూసి తీరాల్సిందే. అప్పటివరకూ అవుట్‌ స్వింగర్‌లతో స్టోక్స్‌ను క్రీజులో కట్టిపడేసిన షమి.. ఆ తర్వాత అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మిడిల్‌ వికెట్‌ను నేలకూల్చాడు. స్పిన్‌ బౌలర్‌ వేసినట్లు బంతి లోపలికి టర్న్‌ అవుతూ వికెట్లను గిరాటేసింది. ఏం జరిగిందో అర్ధం కాక స్టోక్స్ బేల చూపులు చూస్తూ పెవిలియన్ చేరాడు. అసలు షమీ బంతులను ఎదుర్కోవడం ప్రత్యర్థి ఆటగాళ్లకు శక్తిని మించిన పనే అవుతోంది.  అవుట్‌ స్వింగ్‌, ఇన్‌స్వింగ్‌, స్లో డెలివరీలతో షమీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. షమి 96 మ్యాచ్‌ల్లో 25.08 సగటుతో 181 వికెట్లు పడగొట్టాడు. చివరి 10 మ్యాచ్‌ల్లో షమి 21 వికెట్లు పడగొట్టాడు. 2015లో 13.78 సగటుతో 14 వికెట్లు తీసిన అతను.. 2019లో 7 మ్యాచ్‌ల్లో 17.29 సగటుతో 17 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. హార్దిక్‌ గాయపడ్డాక జట్టులోకి వచ్చిన షమి.. తనను పక్కన పెట్టడం ఎంత తప్పో రుజువు చేశాడు.