భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాక్ పీకల మీదకు తెచ్చింది. ఆడిన అయిదు మ్యాచుల్లో తొలి రెండు మ్యాచులను గెలిచిన పాకిస్థాన్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. భారత్, ఆస్ట్రేలియా, అఫ్గాన్ చేతుల్లో భంగపాటుకు గురైన పాక్... ఇప్పుడు సెమీస్ చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. హ్యాట్రిక్ ఓటమితో పాక్ సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్ 4లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక్క మ్యాచ్ వర్షం వల్ల రద్దయినా పాక్ ఆశలు గల్లంతే. ఇప్పటికీ సెమీఫైనల్ చేరుకోవడానికి పాక్‌కు అవకాశమైతే ఉంది. కానీ ఈ అవకాశం చాలా క్లిష్టంగా ఉంది.
టీమిండియా టాప్
ప్రస్తుతం ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా ఆడిన అయిదు మ్యాచుల్లో విజయం సాధించి 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయిదు మ్యాచుల్లో నాలుగు విజయాలు.. ఒక ఓటమితో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్ 4 పాయింట్లతో అయిదో స్థానంలో ఉండగా.. అఫ్గాన్ కూడా అన్నే పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పాక్‌కు, అఫ్గాన్‌కు పాయింట్లు నాలుగే ఉన్నా అఫ్గాన్ కంటే పాక్ రన్‌రేట్ కొంచెం మెరుగ్గా ఉంది. తర్వాతి స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, శ్రీలంక ఉన్నాయి. 2019 ప్రపంచకప్ ఛాంపియన్ ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో బ్రిటీష్ జట్టు కేవలం ఒకే విజయం సాధించింది.
పాక్ ముందంజ వేయాలంటే..?
ఈ ప్రపంచకప్‌లో పాక్ నిలవాలంటే ఇక ఓటమి, వర్షం వల్ల మ్యాచ్ రద్దు అనే మాటే ఉండకూడదు. 2019లోనూ పాక్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2019 ప్రపంచకప్‌లో మెరుగైన రన్‌రేట్ కారణంగా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరింది. ఇప్పుడు కూడా పాక్ అదే స్థితిలో ఉంది. వర్షం పడకుండా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల ఫలితాలు రావాలి. ఆ నాలుగు మ్యాచుల్లోనూ పాక్ కచ్చితంగా గెలవాలి. చెన్నైలో దక్షిణాఫ్రికాతో, కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో, బెంగళూరులో న్యూజిలాండ్‌తో కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో పాక్ తలపడాల్సి ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మ్యాచుల్లో పాక్‌కు కఠిన సవాల్ ఎదురు కావచ్చు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి ఎదురైనా ఈ మహా సంగ్రామంలో పాక్ కథ ముగిసినట్లే.
ప్రపంచకప్‌లో అఫ్గాన్ సంచలన విజయం సాధించి పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆ జట్టు పాక్‌పై పంజా విసిరింది. పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 74, ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 58 పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, నవీనుల్ హక్ 2 వికెట్లు తీశారు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌కు శుభారంభం దక్కింది. అఫ్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ 65.... ఇబ్రహీం జాద్రాన్ 74 పరుగులతో రాణించి జట్టు విజయానికి పునాది వేశారు. రహ్మత్ షా 77, హష్మాతుల్లా షాహిది 48 పరులతో సమయోచితంగా రాణించారు. అఫ్గాన్ బ్యాటర్లు రాణించడంతో మరో ఆరు బంతులు మిగిలుండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్గాన్‌పై ఓటమితో పాక్ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. పాక్ మిగిలిన 4 మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్-4లోకి వచ్చే అవకాశం ఉంది.