ODI World Cup 2023: భారత్‌ (India )వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌(World Cup)లో ఇప్పుడు ఎక్కడచూసినా మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell)విధ్వంసం గురించే చర్చ జరుగుతోంది. అయితే మ్యాక్స్‌వెల్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేసిన ముజీబ్‌() గురించి కూడా చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనూ 20 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు పడిపోయినప్పుడు కోహ్లీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మిచెల్‌ మార్ష్‌ వదిలేశాడు. క్యాచ్‌ వదిలినప్పుడు 12 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ మొత్తం 85 పరుగులు చేసి భారత్‌కు చిరస్మరణీయమైన విజయం అందించాడు. అందుకే క్యాచులు మ్యాచ్‌లను గెలిపిస్తాయని అంటారు. అయితే ఈ ప్రపంచకప్‌లో అత్యధికంగా క్యాచులు పట్టిన జట్టు ఏదని అనుకుంటున్నారు. మీరు ఆశ్చర్యపోయేలా ఆ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌. ఈ ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన బ్రిటీష్‌ జట్టు కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటికే సెమీస్‌, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఇంగ్లండ్‌ దూరమైంది. ఇంకా నెదర్లాండ్స్, పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. క్యాచ్‌లు పట్టే విషయంలో ఇంగ్లండ్ ఎఫీషియన్సీ 85 శాతం. ఈ అంశంలో టీమిండియాతో కలిసి ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ వంటి విషయాల్లో పేలవంగా ఆడుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఫీల్డింగ్ విషయంలో మాత్రం మెరుగ్గా కనిపిస్తోంది.


గ్లెన్ మ్యాక్స్‌ వెల్ 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు  మ్యాక్స్ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను ముజీబ్‌ నేలపాలు చేశాడు. అప్పుడు ముజీబ్‌ నేలపాలు చేసింది క్యాచ్‌ను కాదు. అఫ్గాన్‌ గెలవాల్సిన మ్యాచ్‌ను. అంతే జీవనదానంతో మ్యాక్స్‌వెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అఫ్గాన్‌ బౌలర్లను ఒంటి చేత్తో ఊచకోత కోశాడు. అసలు ఆస్ట్రేలియా కూడా ఊహించని విజయాన్ని మ్యాక్స్‌వెల్‌ ఆ జట్టుకు అందించాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో మ్యాక్సీ అజేయంగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్‌ చేసిన 201 పరుగుల్లో 144 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. 


ఇక ప్రపంచకప్‌లో నేడు  మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్‌ తలపడనుంది. ఇప్పటికే ఇరు జట్లు సెమీస్‌ అవకాశాలు కోల్పోవడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా మారింది. కానీ ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ విజయం సాధిస్తే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. .పాయింట్ల పట్టికలో టాప్ ఏడు జట్లు, ఆతిథ్య పాకిస్థాన్ మాత్రమే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుందని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలను కూడా కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు... నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లపై మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలని భావిస్తోంది. కాగితంపై చాలా ప్రమాదకరంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు, విశ్వాసం, ఫామ్ కోల్పోయి కష్టాలు పడుతోంది. నెదర్లాండ్స్ ఏడు మ్యాచుల్లో రెండు విజయాలు, అయిదు పరాజయాలతో నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌కు ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకోవడానికి ఇది సువర్ణావకాశం. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై డచ్‌ జట్టు విజయాలు సాధించింది. ఆల్‌రౌండర్లతో నిండిన నెదర్లాండ్స్ తాము గెలవగలమని ఇప్పటికే నిరూపించింది. టాప్ ఆర్డర్, బౌలింగ్ మరింత నిలకడగా రాణిస్తే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.