Mumbai vs Vidarbha Ranji Trophy Fina: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ( Ranji Trophy)ని మరోసారి దక్కించుకునేందుకు ముంబై(Mumbai) జట్టు సిద్ధమైంది. ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై..మళ్లీ ఆ కప్పును అందుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. విదర్భ(Vidarbha)తో జరుగుతున్న పైనల్‌లో ముంబై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 141/2 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ముంబై.. 418 రన్స్‌కు ఆలౌటైంది. ఈక్రమంలో విదర్భ జట్టు ముందు 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ అద్భుత శతకంతో ముంబైకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. 326 బంతులు ఎదుర్కొన్న ముషీర్ ఖాన్‌ 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 95 పరుగులు చేసి త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 14 నెలల తర్వాత అయ్యర్‌కు ఇది తొలి అర్ధ శతకం కావడం విశేషం. ముంబై కెప్టెన్ అజింక్య రహానె కూడా హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 143 బంతుల్లో 73 పరుగులు చేశాడు. మరో ముంబై బ్యాటర్‌ శామ్స్‌ ములాని  కూడా అర్ధ శతకం బాది నాటౌట్‌గా నిలిచాడు. విదర్భ బౌలర్లలో హర్ష్‌ దూబె ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. యశ్ ఠాకూర్‌ 3, ఆదిత్య థాక్రే, అమన్‌ తలో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసేసరికి విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ధ్రువ్ షోరె (7), అథర్వ తైడే (3) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. 


గెలిస్తే కొత్త చరిత్రే
ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో విదర్భ నెగ్గాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. భారత పిచ్‌లపై నాలుగు, ఐదు రోజులలో బంతి స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. విదర్భ బ్యాటింగ్‌ లైనప్‌ కూడా అంత పటిష్టంగా లేదు. ఈ పరిస్థితులలో ముంబై బౌలర్లను ఎదుర్కుని 538 పరుగులు చేయాలంటే ఆ జట్టు చెమటోడ్చాల్సిందే. రెండు రోజులు క్రీజులో నిలిచి కొండను కరిగించగలిగితే విదర్భ కొత్త చరిత్ర సృష్టించినట్టే. 


తొలి ఇన్నింగ్స్‌లో...
విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్‌ అయింది. మొదటి రోజే 30 పరుగులు కూడా చేయకుండానే 3 వికెట్లు కోల్పోయిన విదర్భ.. రెండో రోజు కూడా అదే కొనసాగించింది. ముంబై బౌలర్ల ముందు విదర్భ బౌలర్లు నిలపడలేకపోయారు. యశ్‌ రాథోడ్‌ ఒక్కడే 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో ధవల్‌ కులకర్ణి, శామ్స్‌ ములానీ, తనూష్‌ కొటియాన్‌లు తలా మూడు వికెట్లు తీయగా శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు. ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్‌ లల్వాని (37) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఓ దశలో 81-1 స్కోరుతో మెరుగైన స్థితిలో కనిపించిన ముంబై 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. రహానే(7), శ్రేయాస్‌ అయ్యర్‌(7) తక్కువ పరుగులకే వెనుదిరగగా... శార్దుల్‌ ఠాకూర్‌ వన్డే తరహాలో ఆడి 69 బంతుల్లో 75 పరుగులు చేశాడు.ఈ తరుణంలో శార్దుల్‌ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గాడిలో పడేశాడు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులకు ఆలౌట్‌ అయింది.