Mumbai Vs Madhya Pradesh: దేశవాళీ ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై విజేతగా నిలిచింది. ఆదివారం దాదాపుగా ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో మధ్య ప్రదేశ్ పై ఐదు వికెట్లతో విజయం సాధించింది. ఈ టోర్నీని ముంబై దక్కించుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది.


రజత్ పాటిదార్ (40 బంతుల్లో 81, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ తో సత్తాచాటాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాది స్కోరుబోర్డును తను ఉరకలెత్తించాడు. ఛేదనను ముంబై 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (35 బంతుల్లో 48, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సుడిగాలి ఆటతీరుతో ఎంపీ బౌలర్లపై విరుచుకు పడ్డాడు.  భారత క్రికెటర్, సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (30 బంతుల్లో 37, 4 ఫోర్లు) తన విలువేంటో చాటాడు. శ్రేయస్ అయ్యర్ (16), పృథ్వీ షా (10), శివమ్ దూబే (9) విఫలమయ్యారు. 


ఒకే ఒక్కడు..
నిజానికి ఎంపీ భారీ స్కోరు చేయగలిందంటే దానికి కారణం రజత్ అంటే అతిశయోక్తి కాదు. ఓపెనర్లు అర్పిత్ (3), హర్ష్ (2) త్వరగా పెవిలియన్ కు చేరడంతో ఆరంభంలోనే ఎంపీ ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో సుభ్రాంశు సేనాపతి (23), హర్ప్రీత్ సింగ్ బాటియా (15), ఐపీఎల్ సంచనలం వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19)లతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అవసరమైనప్పుడుల్లా బౌండరీలు బాదుతూ ఒంటరి పోరాటం చేశాడు రజత్. ఇక బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, డయాస్ రెండేసి వికెట్లతో సత్తా చాటారు. శివం దూబే, అథర్వ, షెడ్గేలు తలో వికెట్ తీశారు. 


Also Read: WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం


కీలక భాగస్వామ్యం..
ఇక ఛేదనలో పృథ్వీ షా త్వరగానే ఔటయ్యినా శ్రేయస్ అయ్యర్, రహానే కుదురుగా ఆడారు. అయిత కాసేపటికే శ్రేయస్ కూడా ఔటవడంతో 47 పరుగులకే రెండు వికెట్లతో ముంబై కాస్త కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య తన దైన శైలిలో ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని బౌండరీలు సాధించాడు. రహానే కూడా బ్యాట్ ఝుళిపించడంతో ముంబై సునాయాసంగా టార్గెట్ వైపు కదిలింది. ఈ క్రమంలో మూడో వికెట్ కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత రహానే, దూబే , సూర్య ఔటయ్యినా షెడ్గే కీలక సమయంలో వేగంగా పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బౌల్లలో త్రిపురేశ్ రెండు వికెట్లతో రాణించాడు. శివం శుక్లా, వెంకటేశ్, కుమార్ కార్తికేయలకు తలో వికెట్ దక్కింది. సూర్యాంశ్ షెడ్గేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, రహానేకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.  

Also Read: Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్