Pakistan Cricket News: వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ జట్టు(Pakistan Cricket team)కు కొత్త అధ్యక్షుడు వచ్చాడు. లాహోర్‌లో జరిగిన పీసీబీ అధ్యక్ష ఎన్నికలలో సయిద్‌ మోహ్సిన్‌ రజా నఖ్వీ(Mohsin Naqvi) పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు  బోర్డు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పీసీబీకి 37వ అధ్యక్షుడిగా ఎన్నికైన నఖ్వీ.. నేటి నుంచి మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నఖ్వీ.. ఎంపిక గత నెలలోనే పూర్తైనా అధికారికంగా ఎన్నికల ప్రక్రియ నేడు ముగిసింది. పీసీబీ తాత్కాలిక చీఫ్‌గా ఉన్న షా ఖవర్‌ ఆధ్వర్యంలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్‌ జరుపగా బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా నఖ్వీని ఎన్నుకున్నారు. 2022లో రమీజ్‌ రాజా తర్వాత పీసీబీకి ఫుల్‌ టైమ్‌ చైర్మన్‌గా ఎన్నికైంది నఖ్వీనే. పాక్‌లో క్రికెట్‌ అభివృద్ధితో పాటు పాకిస్తాన్‌ క్రికెట్‌లో ప్రొఫెషనలిజం తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని  సయిద్‌ మోహ్సిన్‌ రజా నఖ్వీ  తెలిపాడు. నఖ్వీ.. గతంలో అమెరికా వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న CNN ఛానెల్లో పనిచేశాడు. తర్వాత పాకిస్తాన్‌కు వచ్చి పత్రికతో పాటు  24 న్యూస్‌ ఛానెల్‌ ఏర్పాటు చేశాడు. 


పాక్‌కు గెలుపేలేదు 
వన్డే ప్రపంచకప్‌ తర్వాత దాయాది జట్టులో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమితో పాక్‌ కెప్టెన్సీ పదవికి బాబార్‌ ఆజమ్‌ రాజీనామా చేసినప్పుడు మొదలైన ఈ రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాక్‌లో విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వేళ.. ఇప్పటికే ముగ్గురు సిబ్బంది రాజీనామా చేయగా తాజాగా పాక్‌ క్రికెట్‌ బోర్డులో పెద్ద తలకాయ కూడా రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది. పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు( Pakistan Cricket board) చైర్మన్ జ‌కా అష్రఫ్‌(Zaka Ashraf) తన పదవికి రాజీనామా చేశారు. ప‌ద‌వి చేప‌ట్టి ఏడాది కాక‌ముందే పీసీబీ మేనేజ్‌మెంట్ క‌మిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు. పాక్ జ‌ట్టు వ‌రుస వైఫ‌ల్యాల నేప‌థ్యంలో అష్రఫ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క విజయం కోసం సుమారు రెండున్నర నెలలుగా పాక్‌ అభిమానులు కళ్లు కాయాలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా ఒక్క విజయం కూడా నమోదు కాలేదు.


పాక్‌ జట్టు ఆటతీరు సహా పీసీబీ అధ్యక్షుడిగా అష్రఫ్ ప‌నితీరుపై కొంద‌రు అసంతృప్తిగా ఉన్నార‌ు. పాక్ క్రికెట్‌ను వృద్ధిలోకి తెద్దామ‌నుకున్నాను కానీ ఆ విధంగా ప‌ని చేయ‌డం తనకు సాధ్యం కాలేదని... తన స్థానంలో పీసీబీ ఛైర్మన్‌గా ఎవ‌రిని నామినేట్ చేయాల‌నేది ప్రధాన మంత్రి నిర్ణయం తీసుకుంటారని రాజీనామా అనంతరం అష్రఫ్ తెలిపాడు. గ‌డిచిన రెండేళ్ల కాలంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ముగ్గురు అధ్యక్షులు మారారు. ర‌మిజ్ రాజా, న‌జం సేథీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వైదొలగగా... తాజాగా అష్రఫ్‌ కూడా పదవికి రాజీనామా చేశాడు. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ మార్పులు చేయగా.. తాజాగా కీలక పదవుల నుంచి మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌ బర్న్, ఆండ్రూ పుట్టిక్‌ నుంచి వైదొలిగారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వీరు రాజీనామా చేసినట్లు అధికారికంగా ధృవీకరించింది. ప్రపంచకప్‌లో పాక్‌ క్రికెట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మికీ ఆర్థర్‌, గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌, ఆండ్రూ పుట్టిక్‌ రాజీనామా చేశారు. పీసీబీ వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొంది.