Jasprit Bumrah Latest News: టీమిండియాలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా.. కీలకమైన ఇంగ్లాండ్ పర్యటనలో కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడటంపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మాజీ క్రికెటర్ల నుంచి మొదలు కుని సగటు భారత అభిమాని దాక ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత కీలకమైన పర్యటనలో కేవలం మూడు మ్యాచ్ లు ఆడటం ఏంటని, భారత జట్టుకు ఎంతో ముఖ్యమైన ఐదో టెస్టులో ఆడితే బాగుండేదని పలువురు సన్నాయి నొక్కులు నొక్కారు. అయితే తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. బుమ్రాకు మద్దతుగా నిలిచాడు.
వేరే లెవల్.. ఏ జట్టుకైనా బుమ్రా ఆడుతున్నాడంటే, ఆ జట్టు వేరే లెవల్లో ఉంటుందని, తను జట్టుకు యాడ్ వ్యాల్యూ చేస్తాడని క్లార్క్ చెప్పుకొచ్చాడు. జట్టుకు తను ఆడుతుంటే వచ్చే ఫాయిదానే వేరని, ప్రత్యర్థులు కూడా బుమ్రా ఆడటం బట్టి ప్రణాళికలు వేసుకుంటారని పేర్కొన్నాడు. గతంలో ఎన్నో మ్యాచ్ ల్లో జట్టుకు తను ఎంతగానో సేవ చేశాడని గుర్తు చేశాడు. అయితే బుమ్రా లేని సమయంలో టీమిండియా రెండు టెస్టులను గెలిచిందని, ఇదో అద్భుతమని పేర్కొన్నాడు. ఈ విజయంలో పాలు పంచుకున్న భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ లను అభినందించాడు. బుమ్రాలాంటి కీలక బౌలర్ దూరమైనప్పటికీ, ఔట్ స్టాండింగ్ గా ఆడి జట్టును గెలిపించారని కితాబిచ్చాడు.
తనో అద్భుత బౌలర్..ముఖ్యంగా ఒత్తిడి నెలకొన్నవేళ తన అత్యుత్తమ ఆటతీరును సిరాజ్ వెలికి తీస్తాడని క్లార్క్ అభిప్రాయ పడ్డాడు. జట్టు తనపైనే అంచనాలు పెట్టుకుని, తననే పెద్ద దిక్కుగా భావించిన క్రమంలో అతని ఆటతీరు అనూహ్యంగా మారిపోతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా అలాంటి సందర్భాల్లో తనలోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని, ఐదో టెస్టులో తను సాధించిన ఫైఫర్ ఆ కోవ లోకే వస్తుందని తెలిపాడు.
అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ లో లీడింగ్ వికెట్ టేకర్ గా సిరాజ నిలిచాడు. మొత్తం 23 వికెట్లు తీశాడు. ఈ టెస్టు సిరీస్ లో ఐదుకు ఐదు టెస్టులు ఆడి, అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్ గా నిలిచాడు. సిరాజ్ తో పాటు ప్రసిధ్, ఆకాశ్ దీప్ సమయోచితంగా రాణించడంతో టీమిండియా.. ఈ ట్రోఫీని 2-2 తో డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే.