Manoj Tiwary Profile: టీమిండియా  వెటరన్ బ్యాటర్, దేశవాళీలో  టన్నుల కొద్దీ పరుగులు చేసిన పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి  మనోజ్ తివారీ  క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.  37 ఏండ్ల తివారీ... ఇక పూర్తిగా రాజకీయాల మీద దృష్టి సారించేందుకు గాను అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. భారత్ తరఫున 2008 నుంచి 2015 వరకూ ఆడిన తివారి..  12 వన్దేలు, 3 టీ20లు ఆడాడు. వన్డేలలో తివారీ పేరిట ఓ శతకం కూడా ఉంది.  వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా  అతడు సెంచరీ చేశాడు. 


దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు మనోజ్ తివారీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. క్రికెట్ తనకు అన్నీ ఇచ్చిందని, ఇప్పుడు  తాను అనుభవిస్తున్నదంతా క్రికెట్ వల్లేనని భావోద్వేగానికి గురయ్యాడు. తనకు క్రికెట్ నేర్పించిన గురువుకు,  క్రికెటర్‌గా ఎదగడానికి తోడ్పాటు అందించిన తల్లిదండ్రులు, భార్యకు  కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. 


ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తివారీ స్పందిస్తూ.. ‘క్రికెట్‌కు గుడ్ బై.  ఈ గేమ్ నాకు అన్నీ ఇచ్చింది.  నేను నా జీవితంలో కలగననివి కూడా ఈ ఆట ద్వారా సంపాదించుకున్నా.  ఈ ఆటకు నేను ఎప్పుడూకృతజ్ఞతతో ఉంటాను..’అంటూ   రాసుకొచ్చాడు.  అంతేగాక తనకు క్రికెట్‌లో ఓనమాలు నేర్పిన  గురువును ఈ సందర్బంగా తివారీ గుర్తుచేసుకున్నాడు.  ‘నా తండ్రి సమానులు, నా గురువు మనబేంద్ర ఘోష్ నా కెరీర్‌కు పిల్లర్‌గా నిలిచారు. ఒకవేళ ఆయనే లేకుంటే నేను కచ్చితంగా ఈ స్థాయిలో ఉండేవాడినైతే కాదు. థాంక్యూ సార్.  మా అమ్మానాన్నలకూ  కృతజ్ఞతలు.  వాళ్లిద్దరూ ఎప్పుడూ నన్ను చదువుమని ఒత్తిడి చేయలేదు.  నేను క్రికెటర్‌గా మారితే నన్ను ప్రోత్సహించారు.  అంతేగాక నా సతీమణి సుస్మిత‌కు కూడా  చాలా థాంక్స్..’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. 


 






2007-08లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ సిరీస్‌కు  తివారీ ఎంపికయ్యాడు.  ఆ తర్వాత  2011లో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో యువరాజ్ సింగ్‌కు గాయం కావడంతో  అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఆ సిరీస్ లోని ఐదో మ్యాచ్‌‌లో సెంచరీ కూడా సాధించాడు.  శతకం చేసినా  తివారీ తర్వాత వన్డే ఆడేందుకు 14 వన్డేల పాటు బెంచ్‌లోనే కూర్చుండాల్సి వచ్చింది.  ఆ తర్వాత  భారత జట్టులో పోటీ పెరగడంతో   సెలక్టర్లు అతడి వైపు కన్నెత్తి చూడలేదు.  భారత జట్టు తరఫున తివారీ తన చివరి వన్డేను  2015లో ఆడాడు. 


అంతర్జాతీయ స్థాయిలో రాణించకపోయినా తివారీ దేశవాళీలో మాత్రం టాప్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. బెంగాల్ తరఫున రంజీలు ఆడిన  తివారి.. 141 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 9,908 పరుగులు సాధించాడు. 169 లిస్ట్ - ఎ గేమ్స్‌లో 5,581 రన్స్ చేశాడు. 183 టీ20లలో  3,436 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో  తివారీ  ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 


అవకాశాలు తగ్గడంతో అతడు 2021లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.  మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి క్రీడా శాఖ మంత్రి కూడా అయ్యాడు. తివారీ చివరిసారిగా 2022-23 రంజీ ఫైనల్‌లో  బెంగాల్ తరఫున ఆడాడు.



















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial