India Vs England Test Series Updates: టీమిండియా.. మూడో టెస్టులో పోరాడి ఓడిన త‌ర్వాత అంద‌రి క‌ళ్లు టీమ్ కాంబినేష‌న్ పైకి వెళుతున్నాయి. ముఖ్యంగా వెట‌ర‌న్ బ్యాట‌ర్ క‌రుణ్ నాయ‌ర్ కు మూడు టెస్టుల్లో ఆరు అవ‌కాశాలు ఇచ్చినా, త‌ను పెద్ద స్కోర్లుగా మార్చ‌లేక పోయాడ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌ను ఇప్ప‌టివ‌ర‌కు ఆరు ఇన్నింగ్స్ ఆడి, కేవ‌లం 131 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇందులో మూడో టెస్టులో చేసిన 40 ప‌రుగులే అత్య‌ధిక స్కోరు కావ‌డం విశేషం. దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత పున‌రాగ‌మ‌నం చేసిన క‌రుణ్.. రీ ఎంట్రీలో అంత‌గా ఆక‌ట్టుకోలేక పోతున్నాడు. ఒక ఎండ్ లో జ‌ట్టులోని ప్ర‌ధాన బ్యాట‌ర్లంతా సెంచ‌రీలు చేయ‌గా, ఒక్క క‌రుణ్ మాత్రం క‌నీసం అర్ద సెంచ‌రీ చేయ‌లేక‌పోయాడు. దీంతో ఇప్పుడు వేళ్ల‌న్ని క‌రుణ్ వేపై వెళుతున్నాయి. త‌న‌కు మ‌రో ఛాన్స్ ఇవ్వాళ వ‌ద్దా అన్న విష‌యంపై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు త‌న‌కు ల‌భించిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోలేక పోయాడ‌ని, అత‌ని బ‌దులుగా మ‌రో ఆట‌గాడిని ఆడిస్తే మేల‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.  

టెక్నిక్ లోప‌మా..?ఇక ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు మంచి ఆత్మ‌విశ్వాసంతో క‌రుణ్ క‌నిపించాడు. డొమెస్టిక్ క్రికెట్లో ట‌న్నుల కొద్ది ప‌రుగుల వ‌ర‌ద పారించి, త‌న‌ను టెస్టు క్రికెట్ కు రీఎంట్రీ ఇచ్చేలా చేశాడు. తొలి టెస్టుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా డ‌బుల్ సెంచ‌రీతో అల‌రించాడు. అయితే మెయిన్ గా తొలి మూడు టెస్టుల్లో మాత్రమే త‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయాడు. కేవ‌లం 22 స‌గ‌టుతో టాపార్డ‌ర్ బ్యాట‌ర్ గా ప‌రుగులు చేయ‌డం అంత‌గా జీర్ణించుకోలేక పోతున్నారు. దేవాంగ్ గాంధీ, దీప్ దాస్ గుప్తాలాంటి మాజీలు.. నాలుగో టెస్టుకు క‌రుణ్ ను ప‌క్కన పెట్టాల‌ని ఘంటా ప‌థంగా చెబుతున్నారు. అత‌ని టెక్నిక్ లో లోపాలున్నాయని పేర్కొంటున్నారు.

మిగ‌తా వారితో పోలిస్తే..క్రిస్ వోక్స్ లాంటి మీడియం పేస‌ర్ల‌ను కాస్త స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్న క‌రుణ్.. జోఫ్రా ఆర్చ‌ర్, జోష్ టంగ్, బ్రైడెన్ కార్స్ లాంటి ఎక్స్ ప్రెస్ బౌల‌ర్లను ఆడ‌టంలో లేట్ అవుతున్నాడ‌ని, అత‌ని టెక్నిక్ లో కొన్ని లోపాలున్నాయ‌ని పేర్కొంటున్నారు. ముఖ్యంగా  వేగంగా వ‌చ్చే బంతుల‌ను ఆడ‌టంలో త‌న ఆక‌ట్టుకోలేక పోతున్నాడ‌ని, కాస్త వేగంతో బెన్ స్టోక్స్ వేసిన బీట్ అవుతున్నాడ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఈనెల 23 నుంచి ప్రారంభ‌మ‌య్యే నాలుగో టెస్టులో యువ ప్లేయ‌ర్ సాయి సుద‌ర్శ‌న్ కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని పేర్కొంటున్నారు. కేవ‌లం 21 ఏళ్ల వ‌యసున్న సుద‌ర్శన్ కు ఇప్ప‌టి నుంచే ఇంగ్లాండ్ లో ఆడిస్తే, రాబోయే రోజుల్లో అత‌ని కెరీర్ కు ఎంతో ఉప‌యుక్త‌మ‌ని పేర్కొంటున్నారు. దీంతో క‌రుణ్ లార్డ్స్ టెస్టుతోనే త‌న చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడేశాడా..? అని చాలామంది సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుపుతున్నారు. దీనికి స‌మాధానం నాలుగో టెస్టులో దొరుకుంతుంద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.