Team India Head Coach: టీం ఇండియా(Team India) తదుపరి ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లను బోర్డు సంప్రదించిందన్న వాదనలను బీసీసీఐ(BCCI) కార్యదర్శి జే షా(Jay Shah) తోసిపుచ్చారు. ప్రస్తుతం టీం ఇండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) పదవీ కాలం ముగియనుండటంతో కొత్త హెడ్ కోచ్ కోసం బిసిసిఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. టీ 20 వరల్డ్ కప్పు(T20 world Cup) తరువాత కొత్త కోచ్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తాడు.
అయితే టీం ఇండియా కు ప్రధాన కోచ్‌గా ఉండటం కోసం బిసిసిఐ పలువురు విదేశీ మాజీ క్రికెటర్లను సంప్రదించిందని, వేర్వేరు కారణాలతో వారంతా ఆ పదవిని స్వీకరించడానికి సుముఖంగా లేరనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతానికి ప్రధాన కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ (stephen fleming), జస్టిన్ లాంగర్(Justin Langer ), రికీ పాంటింగ్ (Ricky Ponting), గౌతమ్ గంభీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కోచ్ పదవిపై ఇప్పటికే రికీ పాంటింగ్ స్పందించాడు. కోచ్ గా ఉంటే కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుందని పేర్కొన్నాడు. ఇక స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా సుమారుగా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక జస్టిన్ లాంగర్ అయితే ఇది ఒక అద్భుతమైన పదవి అని అయితే రాజకీయాలు ఉంటాయి కాబట్టే తిరస్కరించానన్నాడు. ఈ నేపధ్యంలో మాజీ దిగ్గజాలకు బీసీసీఐ కార్యదర్శి జే షా గట్టి కౌంటర్ ఇచ్చాడు.
తాను గానీ బీసీసీఐ గానీ ఏ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ను కోచింగ్ ఆఫర్‌తో సంప్రదించలేదన్నారు. కొన్ని మీడియా విభాగాల్లో ప్రసారం అవుతున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. హెడ్ కోచ్‌గా సరైన వ్యక్తిని తామే ఎంపిక చేస్తామన్నారు . అదికూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందని, భారత క్రికెట్ సమగ్ర స్వరూపాన్ని అర్థం చేసుకున్న వారి కోసం చూస్తున్నామని, అద్భుతమైన జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చే వారినే తాము ఎంపిక చేస్తామన్నారు. భారతీయ క్రికెట్ తదుపరి స్థాయికి ఎదగడానికి కోచ్ గా వచ్చే వ్యక్తికి దేశవాళీ క్రికెట్ ఫ్రేమ్‌వర్క్ గురించి లోతైన పరిజ్ఞానం ఉండటం చాలా కీలకమని జై షా స్పష్టం చేశారు. టీం ఇండియా హెడ్ కోచ్ పదవికోసం దరఖాస్తుల స్వీకరణకు మరో 2 రోజులే సమయం ఉంది. మే 27 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ. అయితే ఇప్పటి వరకు ఎవరెవరు దీనికి దరఖాస్తు చేశారన్న విషయం తెలియరాలేదు. అయితే ఐపిఎల్ సందర్భంగా పరువురు మాజీ విదేశీ ఆటగాళ్ళు భారత్ లో ఉండటం ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు టీం ఇండియా హెడ్ కోచ్ గురించి వారిని ప్రశ్నించడంతో రకరకాల ఊహాగాణాలు బయటకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం జైషా మాట్లాడినదానిని బట్టి భవిష్యత్ భారత కోచ్ కు భారత దేశ క్రికెట్ మీద పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తోంది కాబట్టి రాబోయే కోచ్ భారతీయుడే అయిఉంటాడని అంచనా.