Ind Vs Eng 1st Test Live Updates: భారత ఏస్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా తన కీర్తి కిరీటంలో మరో కలుకితురాయిని చేర్చుకున్నాడు. సేనా కంట్రీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అరుదైన రికార్డుగా నెలకొల్పాడు. సెనా కంట్రీలు అయిన సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇప్పటివరకు 147 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో శనివారం రెండో రోజు రెండు వికెట్లు తీసి, ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాకిస్థాన్ గ్రేట్ పేసర్ వసీమ్ అక్రమ్ (146 వికెట్లు)ను వెనక్కి నెట్టి, తను అగ్రస్థానాన్ని తన కైవసం చేసుకున్నాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (146), ఇషాంత్ శర్మ (130), మహ్మద్ షమీ (123 వికెట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు.
తేలిపోయిన భారత బౌలింగ్..
ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలింగ్ తేలిపోయింది. ఒక్క బుమ్రా తప్ప మరెవరు వికెట్ తీయలేకపోయారు. బౌలింగ్ భారన్నంతా అతనొక్కడే మోస్తున్నట్లు కనిపించింది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ విఫలమయ్యాడు. మరోవైపు కెప్టెన్సీలో శుభమాన్ గిల్ అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపించింది. 48 ఓవర్ల వరకు కూడా నాలుగో పేసరైన శార్దూల్ ఠాకూర్ ను బౌలింగ్ లోకి దించక పోవడం వ్యూహాత్మక తప్పిదంగా కనిపించింది. ఇక పరిస్థితులకు తగినట్లుగా వ్యూహాలను రచించడంలో గిల్ విఫలమయ్యాడు.
అట్టర్ ప్లాఫయిన ఆ ఇద్దరు..
ఈ మ్యాచ్ ద్వారా భారతజట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ డకౌట్ అయ్యి నిరాశ పర్చారు. ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగి, బాధ్యతారాహిత్యమైన షాట్ తో క్యాచ్ ఔట్ కాగా, ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన సుదర్శన్.. ఇంగ్లాండ్ పన్నిన వలలో చిక్కుకున్నాడు. లెగ్ సైడ్ లో రెండు స్లిప్పులను పెట్టి, లెగ్ సైడ్ బంతి వేయగా, ఆ బంతిని వేటాడి కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో తమకు లభించిన అవకాశాలను వీరిద్దరూ వృథా చేసుకున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక పేస్ ఆల్ రౌండర్ గా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ కూడా రెండు విభాగాల్లో కూడా విఫలమయ్యాడు. బ్యాటింగ్ లో 1 పరుగు చేసి ఔటవగా, బౌలింగ్ లో అంతగా ఆకట్టుకోలేక పోయాడు. ఇతని బదులుగా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకుంటే బాగుండేదని మ్యాచ్ కామేంటేటర్లు సైతం వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఇరుజట్లు బ్యాటింగ్ లో సత్తా చాటడంతో మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది.