ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై  సంచలన విజయం సాధించిన తర్వాత అఫ్గానిస్థాన్‌ క్రికెటర్లు సంబరాలలో మునిగిపోయారు. ఇప్పటివరకూ పాకిస్థాన్ చేతిలో పరాజయాల పరంపరకు తెరదించుతూ గ్రాండ్ విక్టరీ కొట్టిన అనంతరం అఫ్గాన్ క్రికెటర్లు తమైదన శైళిలో సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేస్తూ ఒకరినొకరు అభినందించుకుంటూ  సందడి చేశారు. అఫ్గాన్‌ క్రికెటర్ల సంబరాల్లో టీమిండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ కూడా కలిశాడు. అఫ్గాన్‌ టాప్‌ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌తో కలిసి ఇర్ఫాన్‌ మైదానంలో చిందేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది. అఫ్గాన్‌ క్రికెటర్లు కూడా ఒకరినొకరు అభినందించుకుంటూ  డ్యాన్స్‌ చేశారు. తమకు అద్భుతమైన మద్దతు ఇచ్చిన అభిమానులకు మైదానమంతా తిరుగుతూ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన అఫ్గాన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.



ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ ప్రదర్శన అత్యద్భుతంగా  ఉందని క్రికెడ్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ కొనియాడాడు. బ్యాట్‌తో అద్భుతంగా రాణించడం, వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడం అఫ్గాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిందని సచిన్‌ విశ్లేషించాడు. అఫ్గాన్‌ విజయంలో అజయ్ జడేజా పాత్ర ఉందని గుర్తు చేశాడు. మంచి బౌలింగ్ దళంతో ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌లపై విజయాలతో అఫ్గాన్‌ నవ శకం వైపు పయనిస్తోందన సచిన్‌ అన్నాడు. అఫ్గాన్ ఎదుగుతున్న తీరును క్రికెట్‌ ప్రపంచం గమనిస్తోందని క్రికెట్‌ గాడ్‌ చెప్పాడు.



 ఈ ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. తొలుత  ఇంగ్లండ్‌పై ఆప్ఘనిస్తాన్ 69 పరుగుల భారీ తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (80: 57 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు), ఇక్రమ్ అలిఖిల్ (58: 66 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (66: 61 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. కానీ అతని వన్ మ్యాన్ షో సరిపోలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు సాధించారు.



 ఇంగ్లండ్‌పై గెలుపు గాలివాటం కాదని పాక్‌పై గెలుపుతో అఫ్గాన్‌ నిరూపించింది. పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ 49 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (87: 113 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (65: 53 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్), రహ్మత్ షా (77 నాటౌట్: 84 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం (74: 92 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (58: 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ కొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు.