IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్  (ఐపీఎల్) లో  శుక్రవారం  ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సౌత్ బ్యూటీస్  రష్మిక  మందన్న, తమన్నా భాటియాలు  తమ నృత్య ప్రదర్శనలతో అలరించారు.  బాలీవుడ్  గాయకుడు, సంగీత దర్శకుడు అరిజిత్ సింగ్.. ముందు తన గానా బజానాతో  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని ఉర్రూతలూగించగా..   ఆ తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా, నేషనల్ క్రష్ రష్మికలు   తెలుగు, తమిళ్ పాటలతో   మోతేరాను మోతెక్కించారు.  


గవాస్కర్ ‘సామి’ స్టెప్పులు.. 


ఐపీఎల్ - 16 ఓపెనింగ్ వేడుకల్లో   రష్మిక.. ఆస్కార్ అవార్డు పొందిన  ‘నాటు నాటు’తో పాటు  పుష్ప సినిమాలోని  ‘సామి.. సామి’ పాటకు కూడా స్టెప్పులేసింది.  అయితే సామి సామి పాటకు  రష్మిక.. తన ట్రేడ్ మార్క్  స్టెప్పులతో గ్రౌండ్ లో అలరిస్తుంటే   అదే స్టేడియంలో కామెంట్రీ బాక్సులో ఉన్న   దిగ్గజ క్రికెటర్, భారత క్రికెట్ అభిమానులు ‘లిటిల్ మాస్టర్’ అని పిలుచుకునే  సునీల్ గవాస్కర్ కూడా  కాలు కదిపాడు.   రష్మిక డాన్స్ ను  కంప్యూటర్ మానిటర్ లో చూస్తూ.. ‘సామి, సామి’అని పాడుతూ కాలు కదిపాడు. 


సన్నీ  డాన్స్ చేస్తుండగా కామెంట్రీ బాక్స్ లో  పక్కనే ఉన్న  సైమన్ డౌల్, సంజయ్ మంజ్రేకర్ లు కూడా  ఆయనను ఉత్సాహపరిచారు.  ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ బ్రాడ్కాస్టర్  నెరోలి మీడోస్    ఐపీఎల్ లో కామెంటేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నది.  ఆమె   ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  


 






నాటు నాటుకూ.. 


సన్నీ  తెలుగు పాటకు డాన్స్ చేయడం ఇదే కొత్త కాదు.  ఇటీవలే భారత్ - ఆస్ట్రేలియా మధ్య  వన్డే మ్యాచ్ సందర్భంగా  కూడా  గవాస్కర్..  ‘నాటు నాటు’కు స్టెప్పులేశాడు.  అదే రోజు ఆస్కార్ వేదికపై  నాటు నాటుకు అవార్డు వచ్చిన తర్వాత    ‘స్టార్’ నెట్వర్క్ తెలుగు కామెంటేటర్లు  ఈ పాట గురించే చెప్పుకుంటుండగా  అక్కడికి వచ్చిన సన్నీ  ఎన్టీఆర్, బన్నీల ఐకానిక్ లెగ్ మూమెంట్ ను ట్రై చేశాడు.  


ఇక ఐపీఎల్ లో  శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన   సీజన్ తొలి మ్యాచ్ లో  హార్ధిక్ పాండ్యా  సేన.. ధోని అండ్ కో. ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో   ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.  రుతురాజ్ గైక్వాడ్ (92) తృటిలో సెంచరీ కోల్పోయాడు.  అనంతరం లక్ష్యాన్ని గుజరాత్.. 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  గుజరాత్   ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (63), విజయ్ శంకర్ (27), వృద్ధిమాన్ సాహా (25) సాయి సుదర్శన్ (22) లు రాణించారు.  ఈ మ్యాచ్ లో సీఎస్కే తరఫున ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన తుషార్ దేశ్‌పాండే.. 3.2 ఓవర్లు వేసి 51 పరుగులు సమర్పించుకున్నాడు. చెన్నైకి అతడు చూపిన ‘ఇంపాక్ట్’ కంటే చేసిన నష్టమే ఎక్కువ.