MS Dhoni Retirement: ఐపీఎల్-16 మొదలైనప్పట్నుంచీ  సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్నా   ఈసారి కప్ ఎవరు కొడతారు..? అన్నదానికంటే చెన్నై సూపర్ కింగ్స్  సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతున్నది.  గత సీజన్ నుంచే ధోని తప్పుకుంటాడని వార్తలు వస్తున్నా.. దీనిపై ఎప్పటికప్పుడూ ధోని తన స్టైల్‌లో సమాధానాలిస్తున్నాఈ ప్రశ్నలు  నిత్య నూతనమే అయ్యాయి. తాజాగా తాలా మరోసారి  తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 


చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ ముగిసిన తర్వాత  పోస్ట్  మ్యాచ్ ప్రజంటేషన్‌లో ధోనిని కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ ప్రశ్న అడిగాడు.  ‘ధోని ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడా..?  ఇక్కడ (చెన్నైలో) తన ఫైనల్ మ్యాచ్ ఆడాడా..?’అని  అడిగిన ప్రశ్నకు చెన్నై సారథి సమాధానమిస్తూ.. ‘మీరు అడుతున్నది నేను మళ్లీ చెపాక్ లో ఆడతానా..? లేదా..? అనా లేక  మొత్తానికి  దూరమైతాననా..?’అనగా హర్షా కల్పించుకుని ‘మీరు ఇక్కడ  ఆడతారా..?’ అని అడిగాడు. 


ఇప్పుడే ఆ తలనొప్పి ఎందుకు..?


దీనిపై ధోని మాట్లాడుతూ.. ‘ఏమో నాక్కూడా తెలియదు. నాకు  మరో 8 - 9 నెలల సమయముంది. డిసెంబర్ లో ఐపీఎల్ మినీ వేలం జరుగొచ్చు.  దానికి ఇంకా చాలా సమయం ఉంది. అప్పటివరకు నిర్ణయం తీసుకుంటా.   ఇప్పుడే ఆ తలనొప్పి ఎందుకు..?   కానీ ఒక్క విషయం మాత్రం నేను క్లారిటీగా చెప్పగలను.  నేను ఎప్పటికీ  చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు అందుబాటులో ఉంటా. నేను ఫీల్డ్ లో ఉన్నా..  లేక  బయటనుంచి (కోచింగ్) మద్దతు ఇచ్చినా  సీఎస్కేను వీడను.  ప్రస్తుతానికైతే  నేను  ఈ సీజన్  తర్వాత కాస్త విరామం తీసుకుంటా.  జనవరి  31 నుంచి  నేను సీఎస్కే క్యాంప్ లోనే ఉన్నా. నాలుగు నెలలుగా  ఈ ప్రిపరేషన్స్ లోనే గడుపుతున్నా..’అని చెప్పుకొచ్చాడు. 


 






గుజరాత్‌తో మ్యాచ్ లో  టాస్ ఓడటం తమకు కలిసేవచ్చిందని మాహీ అన్నాడు. ఇటువంటి పరిస్థితులను జడ్డూ కరెక్ట్ గా వినియోగించుకుంటాడని, అతడిని అడ్డుకోవడం అంత ఈజీ కాదని చెప్పాడు. మంచు ప్రభావం కారణంగా  చెపాక్ పిచ్  రెండో ఇన్నింగ్స్ లో మందకోడిగా మారింది. దీంతో గుజరాత్ ఇన్నింగ్స్ లో జడ్డూ.. 4 ఓవర్లు వేసి  18 పరుగులే ఇచ్చి  2 కీలక వికెట్లు తీశాడు. దసున్ శనకతో పాటు డేవిడ్ మిల్లర్‌ను జడ్డూ పెవిలియన్ కు పంపాడు. మిల్లర్‌ను బౌల్డ్ చేసిన డెలివరీ అయితే  మ్యాచ్‌కే హైలైట్. 


మ్యాచ్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు  చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. చెపాక్ లో తమ బ్యాటర్లు విఫలమైనా  బౌలర్లు రాణించి  ఆ జట్టును ఈ లీగ్‌లో పదోసారి ఫైనల్స్‌కు చేర్చారు.  చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్.. ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ధోనీ సేన.. 15 పరుగుల తేడాతో గెలుపొందింది.  గుజరాత్ టీమ్‌లో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో  42, 4 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో రషీద్ ఖాన్ (16 బంతుల్లో 30,  3 ఫోర్లు, 2 సిక్సర్లు) భయపెట్టినా చెన్నై విజయాన్ని ఆపలేకపోయారు.  ఈ విజయంతో  ధోనీ సేన ఫైనల్‌కు చేరగా  గుజరాత్ టైటాన్స్..  ముంబై - లక్నో మధ్య జరిగే  మ్యాచ్ లో విజేతతో  రెండో క్వాలిఫయర్ (మే 26) ఆడుతుంది.