BCCI Arranges Private Accommodation In Nagoya Over Poor Rooms:  ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్ పర్యటనకు వెళ్లనున్న భారత పురుషుల క్రికెట్ జట్టుకు ప్రయాణానికి కొద్ది గంటల ముందు ఊహించని సమస్యలు చుట్టుముట్టాయి. ఆటగాళ్లకు అందించిన కిట్స్ సైజులు సరిగ్గా సరిపోకపోవడంతో కలకలం రేగింది. ఈ జెర్సీల సమస్యపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) కిట్ సరఫరాదారు జేఎస్‌డబ్ల్యూ ఇన్‌స్పైర్ మధ్య తీవ్ర చర్చలు కొన‌సాగాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఆదివారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ నుంచి జపాన్ బయల్దేరాల్సి ఉంది. సెప్టెంబర్ 22న జపాన్‌తో జరిగే ఏకైక చారిత్రక టీ20 మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తమ సాధారణ టీమ్ జెర్సీ ధరించనుండగా, సెప్టెంబర్ 28 నుంచి ఆరంభమయ్యే ఆసియా క్రీడల సమరంలో అధికారిక ఏషియన్ గేమ్స్ జెర్సీతో ఆడ‌నున్నారు. 

Continues below advertisement

Read Also: Toughest Opponent Pick: కోహ్లీ, రోహిత్ కాదు ఆ ఇండియన్ బ్యాటర్ చుక్కలు చూపించాడు.. దిగ్గజ బ్యాటర్‌పై ఆసీస్ కెప్టెన్  కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు 

స‌మ‌స్య‌లు ప‌రిష్కారం..క్రికెటర్ల కిట్స్‌లో సైజు సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, అయితే మెజారిటీ కిట్లను ఇప్పటికే సరిదిద్దామని ఐవోఏ వర్గాలు తెలిపాయి. మిగిలిన కొన్నింటిని కూడా త్వరలోనే జట్టుకు అందజేస్తామని పేర్కొన్నాయి. ఆటగాళ్లు ద్వైపాక్షిక మ్యాచ్ కోసం ఒకటి, ఆసియా క్రీడల కోసం మరొకటి చొప్పున రెండు వేర్వేరు జెర్సీలు ధరించాల్సి రావడంతో గందరగోళం ఏర్పడిందని తెలిపాయి.

Continues below advertisement

Read Also: IND VS BAN, Asian Games Semifinal: బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు

రంగ‌లోకి దిగిన బీసీసీఐ..మరోవైపు నగోయాలో భారత అథ్లెట్లకు కేటాయించిన వసతి విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతుండటంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. నిర్వాహకులు పురుషుల జట్టుకు కేటాయించిన గదులు ఎంత ఇరుగ్గా ఉన్నాయంటే, కనీసం కిట్ బ్యాగులు పెట్టుకోవడానికి కూడా చోటు సరిపోని పరిస్థితి నెలకొంది. అక్కడ పెద్ద హోటళ్లు పెద్దగా అందుబాటులో లేనప్పటికీ, జట్టు సభ్యుల సౌకర్యం కోసం బోర్డు చివరి నిమిషంలో సొంతంగా ప్రత్యేక ప్రైవేట్ హోటల్ ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది. మైదానం నాణ్యత, పిచ్ తదితర సౌకర్యాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతుండటంతో బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత మహిళల జట్టు స‌భ్యులు మాత్రం ఐవోఏ కేటాయించిన వసతిలోనే ఉంటున్నారు. మహిళా జట్టు ఆదివారం సెమీస్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. 

గేమ్స్ విలేజ్ లు లేవు..ఈసారి ఆసియా క్రీడల కోసం ప్రత్యేకంగా అంకితమైన గేమ్స్ విలేజ్ ఏర్పాటు చేయ‌లేదు. దీంతో నిర్వాహకులు క్రీడాకారులను క్రూయిజ్ షిప్‌లు, కంటైనర్లు, సాధారణ హోటళ్లలో ఉంచుతున్నారు. చాలామంది భారతీయ అథ్లెట్లు గదుల్లోకి అడుగుపెట్టేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిన‌ట్లు స‌మాచారం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించి మైదానంలో స్వర్ణ పతకమే లక్ష్యంగా శ్రేయస్ సేన బరిలోకి దిగుతోంది.